దీదీకి షాక్.. బీజేపీలో చేరిన టీఎంసీ అభ్యర్థి భార్య

by Shamantha N |
దీదీకి షాక్.. బీజేపీలో చేరిన టీఎంసీ అభ్యర్థి భార్య
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల ముందు బెంగాల్‌లోని అధికార టీఎంసీకి ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ అభ్యర్థి భార్య బీజేపీలో చేరి దీదీకి షాక్ ఇచ్చారు. నాడియా జిల్లా రాణాఘాట్‌ స్థానానికి మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ముకుట్ మణి అధికారి బరిలో నిలిచారు. కాగా.. ఆయన భార్య స్వస్తిక మహేశ్వరి శనివారం కాషాయ కండువా కప్పుకున్నారు. రాణాఘాట్ లో జరిగిన పార్టీ ర్యాలీలో బాలీవుడ్ మెగాస్టార్, బీజేపీనేత మిథున్ చక్రవర్తి సమక్షంలో కమలదళంలో చేరారు.

ఇప్పటికే తన భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకోబోతున్నారు స్వస్తిక. విడాకుల కేసు పెండింగ్ లో ఉండగా.. ఆమె అనూహ్యంగా బీజేపీలో చేరారు. "ముకుట్ మణి అధికారికి ఎవరైనా ఓటు వేస్తే నాలాగే మోసపోతారు" అని ఆమె అన్నారు. ఈ పరిణామంతో ముకుట్ మణి అధికారిపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. ఇకపోతే, గతేడాది వీరిద్దరూ వివాహం చేసుకోగా.. పెళ్లయిన కొన్నిరోజులకే స్వస్తిక ముకుట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై క్రూరత్వానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు.

మరోవైపు, టీఎంసీ అభ్యర్థి ముకుట్ మణి అధికారి నామినేషన్ పైనా వివాదం నెలకొంది. ఆయన 2021లో బెంగాల్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ తరఫున ఎన్నికయ్యారు. కానీ, ఈ ఏడాది ప్రారంభంలో టీఎంసీలో చేరారు. బీజేపీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసే ముందే రాణాఘాట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా అతని పేరుని ప్రకటించింది బీజేపీ. దీనిపై బీజేపీ దుమ్మెత్తి పోయడంతో.. ఎట్టకేలకు ఆయన గత నెలలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

Advertisement

Next Story

Most Viewed