రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల్లోనే హామీలను బొందపెట్టింది

by Sridhar Babu |
రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల్లోనే హామీలను బొందపెట్టింది
X

దిశ, బాన్సువాడ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చిన వంద రోజుల్లోనే హామీలను బొందపెట్టిందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు, ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయనందుకు నిరసనగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం బాన్సువాడ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు 420 హామీలిచ్చి మోసం చేసిందని అన్నారు.

ప్రజలు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే అదేదో తప్పు అన్నట్లుగా సీఎం రేవంత్, మంత్రులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ విధానం ఇలాగే కొనసాగితే ఊరుకోబోమన్నారు. ముఖ్యమంత్రి అవగాహన లోపంతోనే రైతులకు గిట్టుబాటు ధర లేదని, వెంటనే రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story