నిజామాబాద్‌లో కాల్పుల కలకలం?

by Naresh |
నిజామాబాద్‌లో కాల్పుల కలకలం?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో కాల్పులు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై పోలీసు శాఖ విచారణ జరుపుతుండడం కలకలం రేపుతుంది. నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రెండు రోజుల క్రితం ఓ రౌడీ షీటర్ మరో ఇద్దరు కలిసి తమ వద్ద ఉన్న తుపాకితో గాలిలో కాల్పులు జరిపారని పోలీసులకు ఉప్పందింది. నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉండే భవాని దాకా 24 గంటలు తెరిచే ఉంటుంది. దాని వెనుక ఒక బెల్ట్ షాప్ అనుబంధంగా ఉంటుంది. అక్కడ మద్యం కొనుగోలు చేసి సేవించిన వారు దాబాలో తినడం నిత్యం తంతుగా ఉంది. నిజామాబాద్ నగరంలో తెల్లవారుజాము వరకు ఓపెన్‌గా ఉంటుందని అక్కడ మద్యంతో పాటు మంచింగ్ దొరుకుతుందని మద్యం ప్రియులు అక్కడికి రావడం రివాజు. ఇటీవల సంబంధిత బెల్ట్ షాప్ వద్ద ముగ్గురు వ్యక్తులు తమ వద్ద ఉన్న తుపాకితో గాలిలో కాల్పులు జరిపారనేది ఆరోపణలున్నాయి. ఈ విషయం పై సమాచారం అందుకున్న స్థానిక సీఐ, ఎస్సైలు బుధవారం రాత్రి విచారణ జరిపినట్లు తెలిసింది. గురువారం మిర్చికంపౌండ్‌కు చెందిన ఒక రౌడిషీటర్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

అయితే ఆ రోజు రాత్రి జరిగిన తతంగం పై స్థానికంగా ఎవరు నోరు మెదపడం లేదు. ఎందుకంటే రాత్రి వేళ జరిగే మద్యం, మంచింగ్ దందా బంద్ అవుతుందని నిర్వాహకులు నోరు తెరవడం లేదనేది చర్చ జరుగుతుంది. గురువారం ట్రైనీ ఐపీఎస్ చైతన్య రెడ్డితో పాటు మరి కొందరు అధికారులు ఈ ఘటన జరిగిందా లేదా అన్న అంశంపై విచారణ చేపట్టారు. నిజామాబాద్ నగరంలో తాను గన్ కొనుగోలు చేశానని ఇటీవల పాత బస్తీలో పోలీసులకు చిక్కిన కాలపత్తార్‌కు చెందిన రౌడి షీటర్ అసద్ పోలీసుల వాంగ్మూలంలో తెలిపిన విషయం అందరికీ విధితమే. అదే మాదిరిగా గత ఏడాది సెప్టెంబర్‌లో నిజాం కాలనీలో హంజల బేగ్‌ అనే పీడీఎస్ దందా ఏజంట్ వద్ద పిస్టల్ (నాటు తుపాకీ) దొరకడంతో ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. అలాంటి సమయంలో మరోసారి నగరంలో కాల్పుల వ్యవహారంపై విచారణ ఆసక్తి రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed