- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pakistan vs England : బ్రూక్, రూట్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఘోర ఓటమి అంచుల్లో పాక్
దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్‌తో తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం తథ్యమే. హ్యారీ బ్రూక్(317) ట్రిపుల్ సెంచరీతో, జోరూట్(262) ద్విశతకంతో రెచ్చిపోవడంతో ఇంగ్లాండ్ మ్యాచ్‌ను పూర్తిగా చేతుల్లోకి తీసుకుంది. బౌలర్లు కూడా మెరవడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ విజయానికి ఇంకా 4 వికెట్ల దూరంలో మాత్రమే ఉన్నది. గురువారం ఓవర్‌నైట్ స్కోరు 492/3తో ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 823/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. టెస్టు క్రికెట్‌లో ఇది మూడో అత్యధిక స్కోరు. రెండో అత్యధిక స్కోరు కూడా ఇంగ్లాండ్ పేరిటే ఉన్నది. 1938లో ఆసిస్‌పై ఆ జట్టు 903/7 స్కోరు చేసింది. మూడో రోజే శతకాలు పూర్తి చేసిన బ్రూక్, రూట్ నాలుగు రోజు కూడా అదే జోరు కొనసాగించారు. పాక్ బౌలర్లను ఊచకోతకోశారు. రూట్ 6వ డబుల్ శతకం పూర్తి చేసి.. ఇంగ్లాండ్ తరపున అత్యధిక ద్విశతకాలు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే, ఆసియా జట్లైన భారత్, శ్రీలంక, పాక్‌లపై డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. మరోవైపు, రూట్‌తో పోలిస్తే బ్రూక్ వన్డే తరహాలో రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. చూస్తుండగానే వీరిద్దరూ 250 పరుగుల వ్యక్తిగత మార్కును దాటేశారు. చివరికి పాక్ బౌలర్ల ప్రయత్నం ఫలించింది. అఘా సల్మాన్ బౌలింగ్‌లో రూట్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాదాపు 87 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన ఈ జోడీ 454 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. టెస్టుల్లో అత్యధిక భాగస్వామ్యం జోడించిన జంటగా రూట్, బ్రూక్ జోడీ నిలిచింది. రూట్ అవుటైన తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన బ్రూక్ ట్రిపుల్ సెంచరీ బాదేశాడు. 310 బంతుల్లో త్రిశతకం కొట్టిన బ్రూక్ అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు సెహ్వాగ్(278 బంతుల్లో) పేరిట ఉన్నది. కాసేపటికే ఒకే ఓవర్‌లో బ్రూక్, అట్కిన్సన్(2) అవుటవ్వగా.. స్కోరు 800 మార్క్ దాటిన తర్వాత ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగుల ఆధిక్యం దక్కింది.
పాక్ విలవిల.. 6 వికెట్లు డౌన్
తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 556 పరుగుల భారీ స్కోరు చేసినా.. బ్రూక్, రూట్ విధ్వంసం ముందు ఆ స్కోరు చిన్నదైపోయింది. ఇంగ్లాండ్ ద్వయం ఇచ్చిన షాక్ నుంచి పాక్ కోలుకోలేదేమో. రెండో సెషన్‌లోనే రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆ జట్టు పూర్తిగా తేలిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లు బ్రైడన్ కార్సే(2/39), అట్కిన్సన్(2/28)తోపాటు వోక్స్, లీచ్ చెరో వికెట్‌తో సమిష్టిగా రాణించడంతో పాక్ విలవిలాడిపోయింది. గురువారం ఆట ముగిసే సమయానికి 152/6 స్కోరుతో ఓటమి అంచున నిలిచింది. షఫీక్(0), షాన్ మసూద్(11), బాబర్ ఆజామ్(5), సైమ్ అయూబ్(25), సౌద్ షకీల్(29), రిజ్వాన్(10) పెవిలియన్‌కు క్యూకట్టారు. అఘా సల్మాన్(41), అమీర్ జమాల్(27) వికెట్లు కాపాడుకుని నాలుగో రోజును ముగించారు. నేడు ఆఖరి రోజు. ఇంగ్లాండ్ బౌలర్ల జోరు చూస్తుంటే తొలి సెషన్‌లోనే జట్టుకు విజయాన్ని కట్టబెట్టేలా కనిపిస్తున్నారు.