India GDP: భారత వృద్ధి అంచనాను 7 శాతానికి పెంచిన వరల్డ్ బ్యాంక్

by S Gopi |
India GDP: భారత వృద్ధి అంచనాను 7 శాతానికి పెంచిన వరల్డ్ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను పెంచుతున్నట్టు వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది. దేశంలో అనుకున్న దానికంటే వ్యవసాయ రంగం మెరుగ్గా ఉండటం, ఉపాధి పెరిగే అవకాశాలు కనిపిస్తుండటం, ప్రైవేట్ వినియోగం కారణంగా భారత వృద్ధిని 6.6 శాతం నుంచి 7 శాతానికి పెంచినట్టు ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. వీటితో పాటు ప్రధానమైన దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉందని, పనిచేసే వయసున్న జనాభా పెరుగుతుండటంతో దేశ వృద్ధి సానుకూలంగా ఉందని అభిప్రాయపడింది. ఇక, దక్షిణాసియాకు సంబంధించి వృద్ధి 6.4 శాతంగా ఉంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో దక్షిణాసియా ముందు వరుసలో ఉందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. కాగా, గత కొంతకాలంగా వివిధ రేటింగ్ ఏజెన్సీలు, పరిశొధనా సంస్థలు భారత వృద్ధిని సవరిస్తున్నాయి. ఈ ఏడాది జూలై అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ భారత వృద్ధిని 6.8 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత ఆర్థికవ్యవస్థ వేగంగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. గత నెలలోనూ ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) దేశ వృద్ధిని 7.2 శాతానికి పెంచింది.

Advertisement

Next Story

Most Viewed