విత్తన వ్యాపారుల ఎత్తులు చిత్తు

by Sridhar Babu |
విత్తన వ్యాపారుల ఎత్తులు చిత్తు
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా లోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిర్మల్, మెట్ పల్లి తదితర ప్రాంతాల్లో ప్రతి ఏటా రైతులు ఎర్రజొన్నల సాగును విస్తారంగా సాగు చేస్తుంటారు. ఈ సంవత్సరం ఎర్ర జొన్న పంట చేతికి వచ్చిన ఫిబ్రవరి మొదటి వారం నుండి ఎర్ర జొన్న విత్తన వ్యాపారులు మైండ్ గేమ్ కు తెర లేపారు. ఎర్ర జొన్న విస్తీర్ణం బాగా పెరిగింది, పంట దిగుబడి ఎక్కువగా ఉంది, బళ్లారిలో సైతం దిగుబడి మంచిగా వచ్చింది.. ఈసారి ఎర్ర జొన్నలకు అంతగా డిమాండ్ ఉండదు.. అంటూ ప్రచారం నిర్వహిస్తూ 3500 నుంచి 3700 వరకు ధర క్వింటాల్ ఎర్ర జొన్నలకు ఉంటుందని ప్రచారం చేశారు. కానీ ఎర్ర జొన్న రైతులు వ్యాపారస్తుల ప్రచారం పట్టించుకోకుండా వినూత్న ఆలోచనలతో ముందుకు సాగారు.

ఈ ఏడాది రైతులు సాగుచేసిన ఎర్రజొన్న పంట దిగుబడులను నిలువ చేసేందుకు గ్రామాలకు గ్రామాలుగా ఊర్లలో తీర్మానాలు చేసుకుంటూ కోల్డ్ స్టోరేజీ లో ఉంచేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఎర్రజొన్న రైతులను బోల్తా కొట్టించేందుకు ప్రయత్నించిన విత్తన వ్యాపారుల మైండ్ గేమ్ అటకెక్కింది. ఆర్మూర్ ప్రాంతంలో సుమారు 60 మంది ఎర్రజొన్న, సజ్జ, వడ్ల వ్యాపారులు రైతులకు కల్లబొల్లి మాటలు చెబుతూ రైతులతో ఒప్పందాలు చేసుకుంటారు. ఈ ఏడాది సైతం రైతులతో మైండ్ గేమ్ ప్రారంభించి వ్యాపారులంతా సిండికేట్ గా మారి ఎర్ర జొన్న ధరలు ఎవరూ పెంచవద్దని మాట్లాడుకుని రైతులను నట్టేట ముంచేందుకు ప్రయత్నించారు.

సిండికేట్ గా ఎర్రజొన్న వ్యాపారులందరూ రైతుల వద్ద నుండి ఎక్కువ ధరకు కొనుగోలు చేయొద్దని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ సోమ, మంగళవారాల్లో 3950 రూపాయలకు ఎర్రజొన్న క్వింటా ధర పలికింది. అంకాపూర్ గ్రామంలో బుధవారం గురుడి రెడ్డి రైతు సంఘ సభ్యులతో ఎర్రజొన్న వ్యాపారస్తులు క్వింటాల్ ఎర్ర జొన్నలకు 4100 ధరకు కొనుగోలు చేసేందుకు ఒప్పందమైనట్లు రైతులు చెప్పారు. ఏది ఏమైనా ఆర్మూర్ ప్రాంత రైతాంగం తాము పండించిన ఎర్ర జొన్న పంట దిగుబడులను సుమారు ఒక నెల రోజులైనా నిల్వ ఉంచుకున్నట్లయితే ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ సరళిని చూస్తే అర్థమవుతుంది.

Advertisement

Next Story