ఆదాయ వనరులు సమకూర్చుకోవడంపై పాలక మండలి దృష్టి సారించాలి

by Sridhar Babu |
ఆదాయ వనరులు సమకూర్చుకోవడంపై పాలక మండలి  దృష్టి సారించాలి
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణం రోజు రోజుకు విస్తరిస్తున్నందున ప్రజలకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించుటకు గాను ఆదాయ వనరులు సమకూర్చుకోవడంపై పాలక మండలి దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం స్థానిక కళాభారతిలో మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి అధ్యక్షతన జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి అదనపు కలెక్టర్ మను చౌదరి, మున్సిపల్ కమిషనర్ సుజాత హాజరయ్యారు. ఈ సందర్భంగా 2024-25 సంవత్సరానికి రూ.4228.11 లక్షల అంచనా బడ్జెట్, 2023-24 సంవత్సరానికి సవరించిన రూ.3666.4 లక్షల బడ్జెట్ కు సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇందులో పన్నుల రూపేణా రూ.1295.90 లక్షలు, అద్దెలు, టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్ మార్గాల ద్వారా రూ.1368.21 లక్షలు, డిపాజిట్లు, లోన్స్ ద్వారా రూ.22 లక్షలు, క్యాపిటల్ ప్రాజెక్ట్ ఫండ్స్ ద్వారా రూ.142 లక్షలు వస్తాయని అంచనా వేశారు. ఇందులో జీతాలు, శానిటేషన్, విద్యుత్ బిల్లుకు రూ.216 లక్షలు,

గ్రీన్ బడ్జెట్ కింద రూ.296 లక్షలు ఖర్చు చేయాలని నిర్దేశించారు. అదేవిధంగా ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, సాధారణ పరిపాల ఖర్చులు రూ.238 లక్షలు, వార్డు వారీగా చేపట్టిన పనులు, ప్రజోపయోగ పనులకు రూ.22. 33 లక్షలు, డిపాజిట్లు, లోన్ల కింద రూ.22 లక్షలు, నాన్ ప్లాన్ గ్రాంట్ కింద రూ.1542 లక్షలు ఖర్చు చేయుటకు రూపొందించిన ప్రణాళికకు సభ ఆమోదం తెలుపుతూ తీర్మానించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... కౌన్సిలర్లకు ఆయా వార్డుల అభివృద్ధి, పట్టణ అభివృద్ధి పై పూర్తి అవగాహన ఉండడమే గాక అభివృద్ధి పనులు చేపట్టాలని తాపత్రయపడడం చూస్తుంటే సంతోషంగా ఉందని, మున్సిపల్ బడ్జెట్ తో పాటు ఇతర శాఖల సహకారం, ప్రభుత్వం నుండి ఇతర, గ్రాంట్ల రూపంలో వచ్చే నిధులతో పట్టణంలో మంచినీటి సౌకర్యం తదితర వాటికి ఖర్చు చేస్తామన్నారు.

పాలక మండలి కూడా ఆదాయ వనరుల పెంపునకు మార్గాలు అన్వేషించాలని, వాణిజ్య ప్రాంతాలలో యూజర్ చార్జీల ద్వారా, వంద శాతం పన్ను వసూళ్ల ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చని సూచించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, మంచినీరు వృథా కాకుండా ప్రతి ఒక్కరూ కుళాయిలు పెట్టుకునేలా చూడాలని కోరారు. వైకుంఠ ధామాలు వాడుకలోకి వచ్చే విధంగా చూస్తామని సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అదనపు కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ... పేరంటాలను బట్టి ఇంటి పన్నును హేతుబద్దీకరణ చేయడం, వంద శాతం పన్ను వసూలు చేయడం, జనాభా ప్రాదిపదికకు అనుగుణంగా శానిటేషన్, వాటర్ వర్కర్స్ సిబ్బందిని హేతుబద్దీకరించడం ద్వారా ఆదాయ మార్గాలను మెరుగుపర్చుకోవచ్చని, పాలక మండలిలో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వార్డు కౌన్సిలర్లు అడిగిన పలు ప్రశ్నలకు కలెక్టర్ సమాధానమిచ్చారు.

Advertisement

Next Story