జంపింగ్ ట్రెండ్.. పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్న పరాయి మగాళ్ళ మోజు

by Aamani |   ( Updated:2024-10-25 08:45:54.0  )
జంపింగ్ ట్రెండ్.. పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్న పరాయి మగాళ్ళ మోజు
X

దిశ, భిక్కనూరు : పెద్దలు వద్దన్నా... ఎదిరించి పెళ్లి చేసుకున్న వారు కొందరైతే, సాంప్రదాయం ప్రకారం పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నవారు అనేకం. కానీ ఎవరికి చెప్పా పెట్టకుండా లవ్ మ్యారేజ్ చేసుకొని... కొన్నాళ్ళు కాపురం చేసి మోజు తీరాక.. ఆ భర్తను వదిలేసి పరాయి మొగవాడి మోజులో పడి చాలా మంది యువతులు ఎస్కేప్ అవుతున్న సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి. వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, సవాళ్లను అధిగమిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ... మంచి పొజిషన్ లో ఉన్న కుటుంబాలు కొన్ని. అతుకు గతుకులు లేకుండా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ, కలహాల కాపురాలుగా మారుతూ గుట్టుగా ఉన్న కుటుంబాలను బజారుకీడుస్తున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి.

రోజురోజుకు పెరిగిపోతున్న ఖర్చులకనుగుణంగా ఆదాయం పెరగకపోవడం, ఎన్నాళ్లీ చాలీచాలని బతుకులు అనే మనోవేదనతో పాటు, మెయింటెనెన్స్ కూడా భారంగా మారడం వలన చాలా మంది యువతీ యువకులు ఇష్టపడి చేసుకున్న పెళ్లిని క్షణికావేశంతో పెటాకులు చేసుకుని ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇంకొందరైతే ఏకంగా తాను ప్రేమించిన వ్యక్తిని ఎలాగూ మనువాడ లేకపోయానని ప్రేమించిన వ్యక్తితో లేచిపోతే నైనా తన జీవితం బాగుంటుందనే ఉద్దేశంతో, పిల్లలు పుట్టి, వారు పెద్దవారు అయినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా భర్తను విడిచి, తాను కోరుకున్న పరాయి వ్యక్తితో వెళ్లిపోతుండడం, బాధిత కుటుంబాల్లో చిచ్చురేపినట్లవుతోంది. అయినా ఈ విషయం బయటకు పొక్కకుండా, చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ గప్ చుప్ గా సమస్యను పరిష్కరించుకుంటున్నారు కొందరు. కొత్తగా వచ్చిన చట్టాల గురించి అవగాహన లేకపోవడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు ఈ మధ్యన ఎక్కువయ్యాయి. ఇంట్లో గడప దాటి బయటకు వచ్చిన ఘటనలు కొన్నైతే... సీక్రెట్ గా ఉన్న సంఘటనలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి.

సెల్ ఫోన్ ల ప్రభావం ఎక్కువ..

ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది యూత్ సెల్ ఫోన్ లో రీల్స్ మోజులో పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మహిళలు, యువతీ, యువకులు ఎక్కువగా రీల్స్ ను ఫాలో అవుతున్నారు. ముక్కు మొహం తెలియని వారితో ప్రేమలో పడి, భర్త పిల్లలను, కుటుంబ సభ్యులను వదిలి వారితో చెక్కేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా కులం, మతం వయస్సు తో సంబంధం లేకుండా, పెద్ద వయస్సు ఉన్న వారితో చిన్నవారు, చిన్న వయస్సు ఉన్నవారితో పెద్దవారు, ప్రేమ వ్యవహారంలో మునిగిపోయి వారి జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నారు. వీళ్ళు చేసే తప్పుడు పనుల వలన సమాజంలో కుటుంబ సభ్యులు బయట తలెత్తుకొని తిరగలేని పరిస్థితిని తీసుకొస్తున్నారు.

ఉదాహరణకు కొన్ని....

వివాహం కాకముందు ప్రేమలో ఉన్న వారితో కొందరు జంప్ అవుతుంటే మరికొందరు పెళ్లయిన అనంతరం ప్రేమలో పడి జంప్ అవుతున్న ఘటనలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలానికి చెందిన వివాహిత వారి కుటుంబ సభ్యులకు పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి, అటు అమ్మగారింటికి వెళ్లకుండా తెలిసిన వ్యక్తితో పిల్లలతో సహా వెళ్లి, మెట్టినింటి వారిని రాత్రంతా ఆగం పట్టించింది. అంతేకాకుండా మరో వివాహిత యువతి పిల్లలతో సహా ఎస్కేప్ కావడం మరో కుటుంబాన్ని బజారుకీడ్చింది. ఒక వివాహిత యువతి పెళ్లైన కొన్ని రోజులకే వివాహిత యువతి అమ్మగారి ఇంటి నుంచి అత్తగారింటికి వచ్చే సమయంలో భర్త ను బోల్తా కొట్టించింది. అన్ని అబద్ధాలు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత, తన పెళ్లి కాకముందు ప్రేమించిన యువకుడితో వెళ్లిన సంఘటన జంపింగ్ ట్రెండ్ కు నిదర్శనం. భిక్కనూరు సర్కిల్ పరిధిలో ఏడాది కూడా పూర్తికాకముందే ఇప్పటి వరకు సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లలో 68 ఉమెన్ మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 8 పోక్సో కేసులు ఉన్నాయి.

పిల్లల పట్ల ప్రేమాభిమానాలు చూపాలి…: భిక్కనూరు సీఐ సంపత్ కుమార్

పెళ్లీడుకు వచ్చిన పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రేమాభిమానాలు చూపాలి తప్ప కోపం చూపించకూడదన్నారు. ఫ్రెండ్ గా ట్రీట్ చేసి ముందుగా వారి ఇష్ట ఇష్టాలను తెలుసుకోవాలన్నారు. అప్పుడే వారిలో ఉన్న భయం తొలగిపోయి మనసులో ఉన్న అభిప్రాయాలను వారితో పంచుకోగలుగుతారన్నా రు. మా మాటే నే నెగ్గాలని, వారి ఇష్టా ఇష్టాలకు వ్యతిరేకంగా పెళ్లిళ్లు చేయకూడదని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తల్లిదండ్రులు కూడా తమ వైఖరిలో మార్పు తెచ్చుకుని వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసినప్పుడే ఎటువంటి సమస్యలు తలెత్తవన్నారు. ముఖ్యంగా చట్టాలపై అవగాహన లేకపోవడం కూడా మరో కారణమని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed