బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది

by Sridhar Babu |
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రజా పాలన చివరి రోజులో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలం ఎల్లారం తండాకు ఇప్పటి వరకు ఎమ్మెల్యే, ఎంపీ వచ్చిన దాఖలాలు లేవు అన్నారు.

రెవెన్యూ శివారు లేదని, గూగుల్ మ్యాప్ లో ఈ తండా పేరే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది బీఆర్ఎస్ పాలనలో పరిస్థితి అన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు అని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాము అని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకు ప్రజా పాలన తెచ్చామని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రెండు హామీలను అమలు చేశారు అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకే ప్రజా పాలనలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, దశల వారీగా మిగతా హామీలను అమలు చేస్తాం అని పేర్కొన్నారు. అనంతరం జుక్కల్ నియోజకవర్గం బీచ్కుంద మండలం ఎల్లారం తండాలో ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావుతో కలిసి ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు.

కౌలాస్ కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం

జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో ఉన్న చరిత్రాత్మక కౌలాస్ కోటను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఎంతో ప్రసిద్ధి చెందిన కౌలాస్ కోటను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. దీనిపై ప్రతిపాదనలు రూపొందించి, నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు. కౌలాస్ కోట అభివృద్ధిపై త్వరలోనే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

Next Story