ఆ ఇంటి నెంబర్ విలువ రూ.2 కోట్లు

by Mahesh |
ఆ ఇంటి నెంబర్ విలువ రూ.2 కోట్లు
X

రవాణా శాఖలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ కు కోట్లు వెచ్చించడం సర్వసాధారణం. సెంటిమెంట్ తో పాటు పుట్టిన రోజులను, కలిసి వచ్చే లక్కీ నంబర్ ను వాహనాల కు వచ్చేలా యజమానులు లక్షల నుంచి కోట్లు కుమ్మరించడం చూస్తుంటాం. అయితే ఒక ఇంటి నెంబర్ విలువ కోట్లలో ఉంది అంటే అది రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అనుకుంటే పొరబడినట్లే. ఇది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనిది. గత ఏడాది ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌కు అనుకుని ఉన్న ఓ అసైండ్ ల్యాండ్‌కు ఇంటి నెంబర్ తీసుకొని కోట్ల రూపాయల విలువైన భూమికి ఎసరు పెట్టారు కొందరు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కొత్త కలెక్టర్ కార్యాలయం సమీపంలోని న్యాక్ బిల్డింగ్ సమీపంలో ఓ ప్రభుత్వ భూమి ఇది. దీన్ని కబ్జా చేసేందుకు ఇంటి నెంబర్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్ ను చూపి ప్రభుత్వానికి చెందిన 110 0 గజాల భూమిని తన్నుకుపోయారు. దీన్ని నగరం లోని ఓ ప్రజాప్రతినిధికి రూ.కోటికి అమ్మారు. ఆ తర్వాత మాజీ కార్పొరేటర్ భర్త ను అడ్డం పెట్టుకొని రూ.2 కోట్లకు కొనుగోలు చేశారు.

ఇలా ఖానాపూర్ గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన ఇంటి నెంబర్, ప్రభుత్వ భూమి కలిపి మొత్తం ధర రూ.2 కోట్లకు పలికింది. ఈ తతంగం వెనుక మరో కుట్ర దాగి ఉంది. రూ.కోటికి అమ్మి రూ.2 కోట్లకు కొన్నారంటే అర్థం చేసుకోవాలి మరి. ఈ భూమి వెనకాలే ఒక ఎకరం పట్టా భూమి, మూడు ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ భూముల్లోకి వెళ్లాలంటే బైపాస్ ప్రధాన రహదారి నుండి రూ.2 కోట్ల భూమి నుంచే వెళ్లాలి.

ఆ రోడ్డును ప్యాక్ చేసి, వారి పని చేసుకునేందుకు తొలుత ప్రజాప్రతినిధికి విక్రయించారు. దాన్ని ఆసరా చేసుకుని, వెనుక భూముల యజమానులను బ్లాక్ మెయిల్ చేసి తక్కువ ధరకు కొట్టేసే పనిలో ఉన్నారు. కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిజామాబాద్, ఖానాపూర్ శివారు భూములు కలిసి ఉండటంతో భూ మాయగాళ్లకు ఈ అవకాశం కలిసి వచ్చింది. ప్రభుత్వ భూములను లక్ష్యంగా పెట్టుకొని యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు.

అందులో భాగంగానే కలెక్టరేట్ సమీపంలోని నాక్ బిల్డింగ్ చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములపై కన్నేశారు. అందుకు నిజామాబాద్ నగరానికి చెందిన బీఆర్ ఎస్ ముఖ్య నేత, ప్రజాప్రతినిధిని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. అందులో భాగంగా నే నిజామాబాద్ నగర శివారు సర్వే నెంబర్ గల భూమిలో ఖానాపూర్ గ్రామం నుంచి ఇంటి నెంబర్ తీసుకొని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. అందుకోసం ఇంటి నెంబర్ ప్రకారం ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. ఇంకేముంది కబ్జా చేసిన భూమికి కోట్ల రూపాయల ధర పలుకుతోంది.

దీని కోసం భూ మాఫియాలోని ఇద్దరు వ్యక్తులు ఒకరు రాష్ట్ర ప్రజా ప్రతినిధి అనుచరులు కాగా, మరొకరు లోకల్ ఏరియా ప్రజాప్రతినిధి అనుచరుడు కావడం విశేషం. వీరిద్దరూ కలిసి మరో ప్రజాప్రతినిధికి ఆ భూమిని రూ.75 లక్షలకు కట్టబెట్టారు. తిరిగి అదే భూమిని రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశారు. సర్కారు భూమిని ఇంటి నెంబర్ ద్వారా కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో మరో మతలబు ఉంది. అదేంటంటే ఈ భూమి వెనకాలే ఉన్న ఒక్క ఎకరం పట్టా భూమి, మూడెకరాల అసైన్డ్ భూమి పై కన్నేశారు సదరు వ్యక్తులు.

అందుకోసమే అమ్మిన భూమిని రెట్టింపు ధరకు కొనుగోలు చేశారు. ఇది అసలు కథ. అయితే న్యాక్ బిల్డింగ్ సమీపంలో ఉన్న ఈ భూమి ప్రభుత్వానిది కావడం విశేషం. అయితే ఈ భూమిని అంత ధర పెట్టి కొనడం వల్ల వెనకాల ఉన్న భూముల ధర తగ్గుతుంది. ఈ భూమి లేకపోతే వెనక భూమికి రోడ్డు లేకపోవడమే అందుకు కారణం. దీంతో సుమారు రూ.10 కోట్ల వరకు లాభాలు అంచనా వేసుకున్న భూమా ఫియా ఏకంగా ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టి పట్టా భూములను కొనే పనిలో పడింది. దీనికోసం కొందరు మధ్యవర్తిగా ఉంటూ సినీ ఫక్కీలో వ్యవహారం నడిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed