నిజామాబాద్ ఎంపీ ఎన్నికల బరిలో నుంచి పదిమంది అభ్యర్థులు ఔట్

by Disha Web Desk 15 |
నిజామాబాద్ ఎంపీ  ఎన్నికల బరిలో నుంచి పదిమంది అభ్యర్థులు ఔట్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ స్థానానికి దాఖలైన నామినేషన్లను కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ శుక్రవారం స్క్రూటినీ చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికల పరిశీలకుని సమక్షంలో అభ్యర్థులు, వారి ప్రతినిధుల ముందు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ కొనసాగింది.

ఈ సందర్భంగా 10 మంది అభ్యర్థులు సమర్పించిన అన్ని సెట్ల నామినేషన్లు వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయని కలెక్టర్ వివరించారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి 42 మంది అభ్యర్థులు 90 నామినేషన్లు దాఖలు చేయగా, స్క్రూటినీలో 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినట్టు తెలిపారు. 32 మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయని అన్నారు. అఫిడవిట్ సమర్పించకపోవడం, సక్రమంగా లేకపోవడం, నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయకపోవడం, ప్రతిపాదకుల వివరాలు పొందుపర్చకపోవడం వంటి కారణాల వల్ల పది నామినేషన్లు తిరస్కరించబడ్డాయని అన్నారు. ఈ మేరకు ఒక్కో అభ్యర్థి వారీగా నామినేషన్ పత్రాలను వారి సమక్షంలోనే పరిశీలిస్తూ, తిరస్కరణకు కారణాలను స్వయంగా కలెక్టర్ అభ్యర్థులకు వెల్లడించారు.

నామినేషన్ల తిరస్కరణకు గురైన అభ్యర్థులు వీరే....

నామినేషన్లు తిరస్కరణకు గురైన వాటిలో మిర్యాల్ కర్ జయప్రకాశ్, పోతు అశోక్, మొహమ్మద్ జమీల్, ఎండీ.షాహెద్ ఖాన్, కొండూరు గంగాధర్, పానిగంటి రజితావాణి, చెంచుల అశోక్, బేగరి పోశం, మీసాల శ్రీనివాస్ రావు, వి.మహాతేజ అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాలేదని కలెక్టర్ తెలిపారు. స్క్రూటినీ ప్రక్రియలో అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed