రేపు అహ్మదాబాద్‌లో ఓటు వేయనున్న ప్రధాని మోడీ

by S Gopi |
రేపు అహ్మదాబాద్‌లో ఓటు వేయనున్న ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిషాన్ ఉన్నత పాఠశాలలో మోడీ ఓటు వేయనున్నారు. దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ మే 7న(మంగళవారం జరగనుంది. అందులో భాగంగానే గుజరాత్‌లో 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ప్రధాని మోడీ ఓటు వేయబోయే పాఠశాలలో ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంతకుముందు, లోక్‌సభ ఎన్నికల మూడో దశలో ఓటు వేసేలా యువతకు అవగాహన కల్పించేందుకు ఆదివారం ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 'రన్ ఫర్ ఓట్' మారథాన్ జరిగింది. 100 శాతం ఓటింగ్ ప్రాముఖ్యతను ప్రచారం చేయడంలో భాగంగా ఈ మారథాన్ నిర్వహించారు. మరోవైపు అహ్మదాబాద్ నగరంలోని ఆరు పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. బెదిరింపులు వచ్చిన పాఠశాలలకు సెలవులు ప్రకటించిన అనంతరం డాగ్ స్క్వాడ్ ద్వారా మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు. వచ్చిన బెదిరింపులు నకిలీ అని తేలింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ నగరానికి వస్తుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాగా, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లో బీజేపీ మొత్తం 26 స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. ఆప్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని అక్కడ 24 స్థానాల్లో పోటీ చేయనుండగా, భావ్‌నగర్, భరూచ్ నియోజకవర్గాల్లో ఆప్ పోటీ చేస్తోంది.

Advertisement

Next Story