కరెంటు లేని చోట ఈవీఎం బటన్‌ని పదే పదే నొక్కితే ఓట్లు పెరుగుతాయా ?

by Disha Web Desk 20 |
కరెంటు లేని చోట ఈవీఎం బటన్‌ని పదే పదే నొక్కితే ఓట్లు పెరుగుతాయా ?
X

దిశ, ఫీచర్స్ : 2024 లోక్‌సభ ఎన్నికల మూడో దశకు మే 7న పోలింగ్ జరగనుంది. ఈ దశలో దేశంలోని 93 లోక్‌సభ స్థానాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల సమయంలో ప్రజల మదిలో ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈవీఎం మెషిన్ ఎలా పనిచేస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం.

EVM మెషీన్ రెండు యూనిట్లతో తయారు చేశారు. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్. కంట్రోల్ యూనిట్ ప్రిసైడింగ్ అధికారి వద్ద ఉంటుంది. బ్యాలెట్ యూనిట్ అనేది ఓటరు ఓటు వేసే యూనిట్. ఈ యూనిట్‌లో అభ్యర్థుల పేర్లు, వారికి ఓటు వేయడానికి ఒక బటన్ ఉంటుంది. రెండు యంత్రాలు ఒకదానికొకటి అనుసంధానించి ఉంటాయి.

ఈవీఎంబటన్‌ను రెండుసార్లు నొక్కితే ఏమి జరుగుతుంది ?

ఓటరు బ్యాలెట్ యూనిట్‌లోని బటన్‌ను నొక్కిన వెంటనే అతని ఓటు నమోదు అవుతుంది. ఆ తర్వాత యంత్రం లాక్ అవుతుంది. ఒక వ్యక్తి ఓటు వేసిన తర్వాత మళ్లీ బటన్‌ను నొక్కితే, అతని అదనపు ఓటు నమోదు అవ్వదు. ప్రిసైడింగ్ అధికారి కంట్రోల్ యూనిట్‌లోని 'బ్యాలెట్' బటన్‌ను నొక్కే వరకు యంత్రం లాక్ చేసి ఉంటుంది. ఈ విధంగా 'ఒక వ్యక్తి, ఒకే ఓటు' హక్కును నిర్ధారిస్తుంది.

కరెంటు లేని ప్రాంతాల్లో ఈవీఎంలు ఎలా వినియోగిస్తారు ?

ఈవీఎం యంత్రం నడపడానికి కరెంటు అవసరం లేదు. ఈవీఎంలు సాధారణ 7.5 వోల్ట్ ఆల్కలీన్ పవర్-ప్యాక్‌తో పనిచేస్తాయి. వీటిని బెంగళూరుకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సరఫరా చేస్తున్నాయి. పవర్-ప్యాక్ 1.5 వోల్టుల వద్ద పనిచేసే 5 AA పరిమాణ కణాలను కలిగి ఉంటుంది. అందువల్ల విద్యుత్ కనెక్షన్ లేకుండా కూడా ఈవీఎంను ఉపయోగించవచ్చు.

ఈవీఎం మెషిన్‌లో ఎన్ని ఓట్లను భద్రపరచవచ్చు, ఆ డేటా ఎంతకాలం నిల్వ ఉంటుంది ?

ఓట్లను నిల్వ చేసే ఈవీఎం సామర్థ్యం దాని మోడల్‌ పై ఆధారపడి ఉంటుంది. పాత వెర్షన్ EVM (2000-05 మోడల్)లో గరిష్టంగా 3840 ఓట్లు వేయవచ్చు. అదే సమయంలో కొత్త వెర్షన్ EVM (2006 నుండి మోడల్) లో గరిష్టంగా 2000 ఓట్లను నిల్వ చేయవచ్చు. ఎన్నికల సంఘం పంచుకున్న సమాచారం ప్రకారం, కంట్రోల్ యూనిట్ ఫలితాలను 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు దాని మెమరీలో నిల్వ చేయవచ్చు.

ఈవీఎంలకు సంబంధించి చట్టం ఎప్పుడు చేశారు ?

మే 1982లో జరిగిన భారత ఎన్నికలలో తొలిసారిగా ఈవీఎం యంత్రాలను ఉపయోగించారు. కేరళలోని పరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 50 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం యంత్రాలను అమర్చారు. ఆ తర్వాత ఈవీఎం వినియోగానికి సంబంధించి చట్టంలో నిర్దిష్టమైన నిబంధన ఉండాలనే డిమాండ్ వచ్చింది. దీని ప్రకారం, డిసెంబర్ 1988లో ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951కి కొత్త సెక్షన్ 61A జోడించారు.

Next Story

Most Viewed