షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ టైం పాస్ కోసమే

by Sridhar Babu |
షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ టైం పాస్ కోసమే
X

దిశ, బోధన్ : బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ టైం పాస్ కోసమేనని ఎంపీ అర్వింద్ విమర్శించారు. విజయ సంకల్ప యాత్ర ను బోధన్ లో గురువారం ప్రారంభించి, షుగర్ ఫ్యాక్టరీ ని పరిశీలించిన అనంతరం విలేకరుల సమావేశంలో ఎంపీ అర్వింద్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బోధన్ చెరుకు రైతులను మరోసారి మోసం చేయడానికి మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కమిటీ ని ఏర్పరచిందని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఎంపీ బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ మోసపూరిత ప్రకటనలతో రైతులను, ఫ్యాక్టరీ కార్మికులను మోసం చేస్తోందని విమర్శించారు.

కమిటీ కేవలం టైం పాస్ కోసమేనని, గతంలో వైఎస్ హయాంలో ఏర్పరచిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను బుట్టదాఖలు చేసిందన్నారు. కాంగ్రెస్ డబ్బు, కుల రాజకీయాలు చేస్తుందని, నోటి కొచ్చిన వాగ్దానాలు చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధి, పునరుద్ధరణ కేవలం బీజేపీతోనే సాధ్యం అని అన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలో వివిధ రాష్ట్రాలలో గల 66 చెరుకు ఫ్యాక్టరీ లను పునరుద్ధరణ చేసిందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే చెరుకు ఫ్యాక్టరీ ల పునరుద్ధరణ కొరకు 9005 కోట్ల ఎస్డిఎఫ్ ఫండ్ తో అభివృద్ధి చేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సిద్దంగా ఉందని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇద్దరూ మంచి దోస్తులని, ఇద్దరు కలిసి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను నిర్ణయిస్తారని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మితే కొని ఫ్యాక్టరీ ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నారని, ఫ్యాక్టరీ రియల్ ఎస్టేట్ విలువ 500 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. పసుపు ధర ను 4500 నుండి 14500 వరకు తీసుకొచ్చిన కేంద్రం పసుపు బోర్డ్ ఎక్కడ పెడతారోనని కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు రైతుల మాదిరి చెరుకు రైతులు ఉద్యమించాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్లు వెయ్యాలని పిలుపునిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తే బోధన్ ఫ్యాక్టరీ ని తెరిపిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story