శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్ల మూసివేత

by Mahesh |
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్ల మూసివేత
X

దిశ, బాల్కొండ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(Sriram Sagar project)లోకి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం తగ్గడంతో ప్రాజెక్టు గేట్లను ఉన్నతాధికారుల ఆదేశానుసారం గురువారం ఉదయం 8 గంటలకు మూసివేసినట్లుగా ఏఈఈ వంశీ తెలిపారు. ఈ సీజన్లో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి మొత్తం ఇన్ఫ్లో 141 టీఎంసీల వరద నీరు వచ్చిందన్నారు. వరద ప్రవాహమును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధికారులు ఎగువ దిగువన ఉన్న గ్రామాలకు, వ్యవసాయ పంటలకు ముంపు గురి కాకుండా నీటిని విడుదల చేశారు. ఈ వరద నీటి విడుదల ప్రక్రియ సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై గురువారం ఉదయం 8. 30 గంటలకు వరద గేట్లు మూసివేశారు. ఇప్పటివరకు వరద గేట్లతో గోదావరిలోకి మిగులు జలాలను 60 టీఎంసీలను విడుదల చేసినట్లు తెలిపారు. ఉగ్ర రూపం దాల్చి ప్రవహించిన గోదావరి ప్రాజెక్టు గేట్లు మూసివేతతో ఒక్కసారిగా శాంతించింది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 76,643 క్యూసెక్కుల వరద వస్తుందన్నారు. కాకతీయకు 4 వేలు, ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 4 వేలు, వరద కాలువకు 15 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 80.5 టీఎంసీలు కాగా గురువారం ప్రాజెక్టు నీటిమట్టం 1088.40 అడుగులు 71.090 టీఎంసీల నీటి నిల్వ వుందని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed