Special Officer : ప్రతి పల్లె "స్వచ్చదనం పచ్చదనం" గా కనబడాలి..

by Sumithra |
Special Officer : ప్రతి పల్లె స్వచ్చదనం పచ్చదనం గా కనబడాలి..
X

దిశ, మోర్తాడ్ : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న "స్వచ్చదనం - పచ్చదనం" కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారి మధు సూధన్ అన్నారు. దీంతో ప్రతి పల్లె "స్వచ్చదనం పచ్చదనం" గా కనబడాలని ఐదు రోజుల పాటు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు. శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలో వివిధ శాఖల మండల, గ్రామాల అధికారులతో సమావేశమై 'స్వచ్ఛదనం - పచ్చదనం' కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాల వారీగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఆయా వార్డుల వారీగా నిర్దేశిత కార్యక్రమాలను చేపట్టేలా స్పష్టమైన కార్యాచరణను రూపొందించుకోవాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి రోజు వారీగా నివేదికలు సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలను, స్థానిక నాయకులను, యువజన సంఘాలను భాగస్వాములు చేయాలని సూచించారు.

పంచాయతీ కార్యదర్శులు, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ వర్గాల వారందరు 'స్వచ్ఛదనం - పచ్చదనం' లో పాలుపంచుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారి సూచించారు. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం గ్రామాల వారీగా ప్రత్యేక కమిటీలను నియమించాలని తెలిపారు. ఈ నెల 5న ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపట్టాలన్నారు. పచ్చదనం, పరిశుభ్రత ఆవశ్యకత గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేలా అన్ని గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఉన్న అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ, మండలం, గ్రామాల వ్యాప్తంగా అన్ని చోట్ల స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తిరుమల, ఎంపీవో శ్రీధర్, ఏపీవో శకుంతల, ఏవో లావణ్య, ఏఈ స్వరాజ్, సూపర్డెంట్ బ్రహ్మానందం పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story