శంకర్ హత్య కేసులో భార్యే ప్రధాన సూత్రధారి

by Sridhar Babu |
శంకర్ హత్య కేసులో భార్యే ప్రధాన సూత్రధారి
X

దిశ, తాడ్వాయి : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని సోమరం గ్రామ శివారులో జనవరి 23 న జరిగిన హత్య వెనుక మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. తాడ్వాయి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు హత్యకు గల కారణాలు వెల్లడించారు. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన సుర్కంటి మనోహర్ రెడ్డి మృతుడు ముదాం శంకర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. లక్ష్మి తన భర్త శంకరును అడ్డు తొలగించుకోవాలని, ఎలాగైనా హతమార్చాలని మనోహర్ రెడ్డిని కోరింది. మనోహర్ రెడ్డి పక్కా ప్రణాళికతో సోమారం గ్రామానికి చెందిన జింక శ్రీనివాస్, అతని భార్య యాదమ్మ తో చర్చలు జరిపారు. శంకర్ ను హతమారిస్తే మీకు పెద్ద మొత్తంలో డబ్బులు అందిస్తామని ఆశ చూపాడు.

డబ్బులు అవసరమైన శ్రీనివాస్ ఈ ఒప్పందం కుదుర్చుకున్నాడు. పక్కా ప్రణాళికతో ఈనెల 21న రాత్రి సోమారం శివారులోని సిద్దుల గుట్ట ప్రాంతానికి మద్యం సేవించడానికి పిలిపించుకున్నాడు. జింక శ్రీనివాస్ అతని భార్య యాదమ్మలు కలిసి ఇనుప రాడ్డుతో తలపై కొట్టగా శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంతకు ముందే నేరస్తుడైన మనోహర్ రెడ్డి పథకం ప్రకారం ముందస్తుగా ముదాం శంకర్ పై ఇన్సూరెన్స్ పాలసీలు చేయించాడు. శంకర్ మృతి చెందితే రూ.50 లక్షల వరకు వచ్చేలా ప్రణాళిక చేసుకున్నాడు. ఇందులో జింక శ్రీనివాస్ కు డబ్బులు అందిస్తామని తెలిపారు. డబ్బుల కోసం ఆశపడ్డ శ్రీనివాస్ పథకం వేసుకొని హతమార్చారు.

ఎస్పీ ఆదేశాల మేరకు రెండు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నామన్నారు. మంగళవారం కామారెడ్డి కొత్త బస్టాండ్ ఏరియాలో నిందితులు తిరుగుతున్నట్లు తమకు సమాచారం వచ్చిందని, వెంటనే వెళ్లి పట్టుకున్నట్లు తెలిపారు. హత్య కేసులో సురకంటి మనోహర్ రెడ్డి, ముదాం లక్ష్మి ,జింక శ్రీనివాస్, జింక యాదమ్మలను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించినట్లు ఆయన వివరించారు. ఈ దర్యాప్తు వేగవంతం చేసి సాంకేతిక పరిజ్ఞానంతో చాకచక్యంగా వ్యవహరించిన స్పెషల్ టీం సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సదాశివ నగర్ సీఐ రామన్ ,తాడ్వాయి ఎస్ఐ ఆంజనేయులు, ఏఎస్ఐ సంజీవ్, సిబ్బంది రమేష్ గౌడ్, నిరంజన్ గౌడ్, ఇర్ఫాన్, సాయిబాబా, అనిత, జయ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed