టైంకు మేడం వెళ్లి పాయే.. సార్ ఏమో లీవులో ఉండే..

by Sumithra |
టైంకు మేడం వెళ్లి పాయే.. సార్ ఏమో లీవులో ఉండే..
X

దిశ, గాంధారి : ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు డాక్టర్లను, వైద్య సిబ్బందిని తిట్ల దండకం చదివిన సంఘటన గాంధారి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం అందుబాటులో వైద్యులు లేకపోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు వైద్యుల పై తిట్ల దండకం చదువుతూ చిరెత్తిపోయారు. అప్పటికే ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జ్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ సెలవులో ఉండడంతో సోమవారం రోజు విధులకు హాజరు కాలేదు. ఆసుపత్రిలో ఉన్న డెంటిస్ట్ డాక్టర్ 12 గంటల వరకు కొంతమంది రోగులను చూసి తరువాత వెళ్లిపోయారు. అప్పటికే చాలా మంది రోగులు మేడం చూస్తుంది కదా అని ఓపికతో ఉన్నారు.

కానీ స్కూల్ బెల్ కొట్టినట్టుగా మేడం టక్కున 12 గంటలకు సరిగ్గా వెళ్ళిపోవడంతో రోగులు తమకు ఎవరు చూస్తారని అక్కడున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చాలామంది రోగులు డాక్టర్లు ఉంటారనే ధీమాతో వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వస్తే ఇక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, ఉన్న ఒక్క డాక్టర్ 12 గంటల వరకు చూసి వెళ్లిపోవడంతో స్టాఫ్ నర్సులు రోగులను చూసి మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారు. 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉండే మేజర్ గ్రామపంచాయతీ కావడంతో డాక్టర్లు అందుబాటులో లేక రోగులు నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం లభిస్తుందని ఎంతో ఆశతో వచ్చిన రోగులకు నిరాశ ఎదురైందని రోగులు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదివరకే డీఎంహెచ్ఓ వచ్చి తమ పనితీరు మార్చుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యం సక్రమంగా చేయాలని ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని చెప్పిన కొన్ని రోజులకే ఇలా మళ్లీ జరగుతుంది.

నేను సెలవు లో ఉన్నాను - ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జ్ డాక్టర్ ప్రవీణ్

ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జ్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ సోమవారం లీవ్ లో ఉన్నాను కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగాయని అన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుంటానని రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తానని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed