ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్ ఇండస్ట్రీ.. నిర్లక్ష్యమే కొంపముంచింది

by Mahesh |
ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్ ఇండస్ట్రీ.. నిర్లక్ష్యమే కొంపముంచింది
X

దిశ, పేట్ బషీరాబాద్ : జీడిమెట్ల - దూలపల్లి రోడ్డులో గల ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదానికి నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. ఫైర్ సేఫ్టీ పరికరాలు పనిచేయకపోవడంతో వందల సంఖ్యలో ట్యాంకర్లు, ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోతోంది. దూలపల్లి రోడ్డులో గల ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్ ఇండస్ట్రీలో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ప్రాణభయంతో అందులో పనిచేస్తున్న కార్మికులు బయటకు పరుగులు తీశారు. క్షణాల్లో మంటలు పెద్దగా వ్యాపించి కంపెనీ యొక్క రెండవ అంతస్తుతో పాటు పెంట్ హౌస్ సైతం పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. తొలుత సమాచారం అందుకున్న జీడిమెట్ల ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తుండగా సనత్ నగర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, ఎల్బీనగర్ ఫైర్ స్టేషన్ సంబంధించిన ఫైర్ ఇంజన్లు ప్రమాద స్థలానికి చేరుకొని మంటలార్పే పనిలో పడ్డారు.

కమ్ముకున్న దట్టమైన పొగలు..

పరిశ్రమలో అంటుకున్న మంటల కారణంగా పెద్ద ఎత్తున నల్లటి పొగలు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేశాయి. సుదూర ప్రాంతాలకు సైతం నల్లటి పొగ అలుముకున్నట్లు కనిపించింది. ప్లాస్టిక్ ముడిసరుకు తో పాటుగా, సంచులు, పెయింటింగ్ ముడి పదార్థాలు దగ్ధమవడంతో భారీ పొగలతో కాలుష్యం చుట్టేసింది. కంపెనీలో ప్లాస్టిక్ సంచులు తయారీతో పాటుగా ఆ సంచులపై ప్రింటింగ్ వేసే పని చేస్తుంటారు. ప్రింటింగ్ వేసే సందర్భంలో ఉపయోగించే రసాయన రంగుల వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

పనిచేయని ఫైర్ సేఫ్టీ..

పరిశ్రమలలో అనుకోని ప్రమాదం జరిగితే తక్షణమే ఉపయోగించాల్సిన ఫైర్‌సేఫ్టీ యూనిట్లేవీ పరిశ్రమలో పని చేయడం లేదు. భారీ విస్తీర్ణంలో ఉన్న ఈ కంపెనీకి ఫైర్ సేఫ్టీ పైప్‌లైన్ ఒకటే ఒకటి ఉండటం అది పూర్తిగా పని చేయకపోవడంలో కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యం కనిపిస్తుంది. కంపెనీ చుట్టూ రెండు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఉపయోగించటానికి ఇసుక ఉంచిన బకెట్లు ఉన్నా అవి సరైన నిర్వహణతో లేనట్లుగా కనిపించాయి. అంతేకాకుండా ఫైర్ ప్రివెంట్ సిలిండర్స్ సైతం ఓ మూలాన పడేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. పేరుకే కంపెనీ ఆవరణలో ఫైర్ సేఫ్టీ టూల్స్ ఏర్పాటు చేసినట్లుగా అర్థమవుతుంది. ఇక కంపెనీ ఆవరణలో 33 కేవీ హై టెన్షన్ లైన్ ఉండటంతో మంటలార్పేందుకు చాలా ఆలస్యమైంది.

కంపెనీ చుట్టూ ఖాళీగా ఉండవలసిన ప్రదేశంలో ఓ వైపు ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు. దీంతో ఫైరింజన్లు కంపెనీ చుట్టూ తిరగలేక ఒకదాని తర్వాత ఒకటి రివర్స్ చేసుకుంటూ మంటలార్పాల్సి వచ్చింది. పరిశ్రమ ఇంతలా డివియేషన్స్ కు పాల్పడిన అంశం ఫైర్ సేఫ్టీ, ఐల, పీసీబీ తదితర ప్రభుత్వ శాఖ అధికారుల దృష్టిలో ఎందుకు పడలేదు..? పడిన చూసి చూడనట్లు వ్యవహరించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీలో ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాల్లో పరిశీలిస్తే కంపెనీలో పనిచేసే కార్మికులకు అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఏ విధంగా స్పందించాలో కనీస అవగాహన లేనట్లుగా తెలుస్తుంది.


Advertisement

Next Story

Most Viewed