పెద్ద మనుషులు.. చిన్న మనసులు..పంచాయితీల పరిష్కారంలో తప్పటడుగులు

by Aamani |
పెద్ద మనుషులు.. చిన్న మనసులు..పంచాయితీల పరిష్కారంలో తప్పటడుగులు
X

దిశ, చిలుకూరు: మండలంలోని ఆ ఊరి పేరు ఆర్లెగూడెం.. అక్కడ దొంగతనాలు జరిగిన, కత్తిపోటు సంఘటనలు చోటుచేసుకున్నా.. ధాన్యం ప్రైవేట్ కొనుగోలులో తూకంలో మోసం చేస్తున్నా.. మరేదైనా వివాదం కానీ.. అక్కడ కొందరు పెద్ద మనుషులు ఆ సమస్యలను పరిష్కరిస్తుంటారు.. కానీ వచ్చిన సమస్య ఏంటంటే వారి పరిష్కారంలో న్యాయానికి అన్యాయం జరుగుతోంది.. దొంగలు దొరలవుతున్నారు.. సామాన్యులు, రైతులు బలి అవుతున్నారు.. ఈ క్రమంలో ఎవరికి అందాల్సిన వాటాలు వారికి అందుతున్నాయి.. కట్ చేస్తే కొందరు అధికారులు కూడా న్యాయాన్ని నడివీధిలో నగ్నంగా ఊరేగించడంలో తమ వంతు పాత్ర పోషించడం 'మామూలు' అయిపోయింది.. ఇది ఓ గ్రామంలో జరిగే తంతు కాదు.. మండలంలో పలు గ్రామాల్లో ఇది 'మామూలే..'.. కలెక్టర్ సార్ ఓ కన్నేయండి ప్లీజ్..

ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పచ్చి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వాతావరణ మార్పుల భయంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన ఆ వ్యాపారులు తప్పుడు తూకాలతో రైతుల రెక్కల కష్టాన్ని నిలువునా దోచుకుంటున్నారు. మంగళవారం మండలంలోని ఆర్లెగూడెంలో ఓ ప్రైవేట్ ధాన్యం వ్యాపారి కొనుగోలు నిర్వహించాడు. అంతకు ముందే తాను మానిప్యులేట్ చేసిన ఎలక్ట్రానిక్ కాంటాలతో ధాన్యాన్ని తూస్తున్నాడు. బస్తాకు నియమిత ధాన్యం కంటే అధిక బరువు గల ధాన్యాన్ని తీసుకుంటుండడంతో అనుమానం వచ్చిన అన్నదాతలు అతనిని నిలదీశారు. కొందరు రైతులు ఆ కాంటాలను పరిశీలించగా ఒక్కో ఎలక్ట్రానిక్ కాంటా ఒక్కో బరువు చూపిస్తోంది.

పచ్చి ధాన్యం కొంటున్నామనే సాకుతో అప్పటికే నియమిత బరువున్న ధాన్యం కంటే మూడు కిలోలు అధికంగా తూకం వేసుకుంటున్న సదరు వ్యాపారి ఈ అక్రమ కాంటాలతో ఇంకా అధిక మొత్తంలో ధాన్యం దోపిడీ కొనసాగిస్తున్నాడు. దీంతో ఈ వివాదం గ్రామ పెద్ద మనుషుల సమక్షానికి చేరింది. ఆ వ్యాపారితో లాలూచీ పడిన కొందరు పెద్ద మనుషులు (?) ఆ సమస్యను మూడో కంటికి తెలియకుండా పరిష్కరించారు. రైతులకు (అ) న్యాయం చేసి వ్యాపారికి లాభం చేశారు. పక్క గ్రామం నుంచి వచ్చిన ఆ వ్యాపారి మోసానికి సొంత ఊరి రైతులను బలి చేశారు ఆ పెద్ద మనుషులు. కొందరు కింది స్థాయి ప్రభుత్వ సిబ్బంది అక్కడకు వచ్చినా చోద్యం చూసి 'సర్ధుబాటు' చేసుకుని మండల కేంద్రానికి తిరిగి వెళ్లారు.

గతంలోనే ఐపీ దాఖలు.. లైసెన్సూ లేదు..!

తాను 'శ్రీరామ' చంద్రుడినని జనాలను నమ్మించే ఆ ధాన్యం వ్యాపారి గతంలోనే రూ. కోట్లలో ఐపీ దాఖలు చేశాడు. అనేక మంది రైతులకు రూ.లక్షల్లో బకాయి ఉన్నాడు. ఇతనికి ధాన్యం కొనుగోలు చేసేందుకు లైసెన్సూ లేదు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు రసీదూ ఉండదు. ఏదైనా మోసం జరిగితే అధికారులు, వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాలన్నా రైతుల దగ్గర ధాన్యం అమ్మకంపై ఏ ఆధారమూ ఉండదు. అయినా ఆ వ్యాపారి కొందరు అధికార, అనధికారుల అండదండలతో ధాన్యం అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నా పట్టించుకునే దిక్కు లేదు ఈ మండలంలో బిక్క చచ్చిన రైతన్న కళ్ల ఎదుట తన రెక్కల కష్టం దోపిడీకి గురవుతున్నా కిక్కురుమనకుండా ఉంటున్నాడు.

ఇవే కాదు.. మరెన్నో..

ఆర్లెగూడెంలో గత కొంతకాలంగా పలు వ్యవసాయ మోటార్లు, ట్రాక్టర్ బ్యాటరీలు, నీటి పైపులు, మోటార్ల రాగి తీగలు.. చివరికి పశువుల దూడలు కూడా చోరీకి గురవుతున్నాయి. ఇవన్నీ సదరు పెద్ద మనుషులే తమ స్టైల్ లో పరిష్కరిస్తుంటారు. తూతూ మంత్రంగా నిందితులకు జరిమానా విధిస్తుంటారు. ఈ విషయాలన్నీ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళతాయో లేదో తెలీదు. వెళ్లినా ఏం జరుగుతుందో అంతకంటే తెలీదు. తాము చెల్లించిన ఆ జరిమానా మొత్తాన్ని సరి చేసుకునేందుకు మళ్లీ దొంగతనాలు చేయడం వీరికి రివాజుగా మారింది. ఏకంగా గ్రామపంచాయతీ ట్రాక్టర్ బ్యాటరీనే ఈ నిందితులు చోరీ చేశారంటేనే వీరి తెంపరితనం, చట్టంపై నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు.

కలెక్టర్ సార్ కన్నేయాలి..

ఈ గ్రామంలో ఇంత అస్తవ్యస్త వ్యవస్థ నడుస్తున్నా కొందరు అధికారులు స్పందించడం లేదని గ్రామంలోని విద్యావంతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్న కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తమ గ్రామంపై కన్నేయాలని వారు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed