అలా సస్పెన్షన్.. ఇలా పోస్టింగ్..

by Aamani |
అలా సస్పెన్షన్.. ఇలా పోస్టింగ్..
X

దిశ,వైరా : విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైన ప్రధానోపాధ్యాయుడికి 40రోజులు గడవక ముందే తిరిగి పోస్టింగ్ ఇచ్చి విద్యాశాఖ అధికారులు తమ వక్రబుద్ధిని చాటుకున్నారు. సస్పెన్షన్‌కు గురైన వైరా మండలంలోనే తిరిగి సదరు ప్రధానోపాధ్యాయుడికి పోస్టింగ్ ఇవ్వడం విశేషం. అంతేకాదు.. సదరు ప్రధానోపాధ్యాయుడు సస్పెండ్‌కు గురైన పాఠశాలకు కూతవేటు దూరంలోనే ఉన్న మరో పాఠశాలలో పోస్టింగ్ ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ పోస్టింగ్ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. వైరా మండలంలోని పాలడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గతంలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేసి సస్పెన్షన్‌కు గురైన చావా శ్రీనివాసరావుకు విద్యాశాఖ అధికారులు ఆగమేఘాల మీద పోస్టింగ్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

పాలడుగు పాఠశాలలోని ముగ్గురు విద్యార్థినుల తల్లిదండ్రులు తమ కుమార్తెలను లైంగికంగా వేధిస్తున్నాడని ప్రధానోపాధ్యాయుడు చావా శ్రీనివాసరావుపై సెప్టెంబర్ నెల చివరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో పాఠశాలలో తీవ్ర స్థాయిలో తల్లిదండ్రులు ఆందోళన చేశారు. దీంతో చావా శ్రీనివాసరావుపై ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. అనంతరం అక్టోబర్ 1న వరంగల్ ఆర్జెడీ సత్యనారాయణరెడ్డి చాలా శ్రీనివాసరావును సస్పెన్షన్ చేస్తూ... ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయనకు 40రోజులు గడవక ముందే విద్యాశాఖ అధికారులు పోస్టింగ్ ఇచ్చారు. అంతేకాకుండా గతంలో సదరు ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్‌కు గురైన వైరా మండలంలోనే వరంగల్ ఆర్జెడి పోస్టింగ్ ఇవ్వడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంతేకాదు.. చావా శ్రీనివాసరావు సస్పెన్షన్‌కు గురైన పాలడుగు ప్రభుత్వం ఉన్నత పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా మళ్లీ అతనికి పోస్టింగ్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో అధికారులకే తెలియాలి. ఈ వ్యవహారంలో విద్యాశాఖ అధికారులు లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని బహిరంగంగానే ఆరోపణలు వినవస్తున్నాయి. నిబంధన ప్రకారం సస్పెన్షన్‌కు గురైన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు తిరిగి అదే మండలంలో పోస్టింగ్ ఇవ్వకూడదు. అయితే ఆ నిబంధనలను ఆర్జెడి అతిక్రమించి అదే మండలం దేవుడెరుగు.... గతంలో సస్పెన్షన్ కు గురైన పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరంలోని మరో పాఠశాలలో పోస్టింగ్ ఇవ్వడం విశేషం. ఇప్పటికైనా విద్యా శాఖ రాష్ట్ర కమిషనర్ ఈ వ్యవహారంపై స్పందించి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలని పాలడుగు గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed