'సౌకర్యాలు లేకుండా ఆర్టీసీ డిపో హడావిడిగా ప్రారంభమా?'.. మంత్రి వేములపై సోషల్ మీడియాలో ఫైర్

by Vinod kumar |
సౌకర్యాలు లేకుండా ఆర్టీసీ డిపో హడావిడిగా ప్రారంభమా?.. మంత్రి వేములపై సోషల్ మీడియాలో ఫైర్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పున: ప్రారంభమైన భీంగల్ ఆర్టీసీ డిపో సేవలపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రధానంగా ప్రతిపక్షాలైతే అధికార పార్టీని టార్గెట్ చేసి దుమ్మెత్తిపోస్తున్నారు. సోషల్ మీడియా వేదిక గా ఈ విషయంలో వార్ షురూ అయింది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మూతపడ్డ ఆర్టీసీ డిపోను తెరిపిస్తామని ఎన్నికలలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి చేసే మొదటి హామీ కావడమే ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో దశాబ్ధంన్నర క్రితం మూతపడ్డ ఆర్టీసీ డిపోను ఇటీవల ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చేతుల మీదుగా పున:ప్రారంభమైందో లేదో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు. బస్ డిపోకు ఉండాల్సిన సౌకర్యాలు ఏమి లేకుండానే ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నిస్తున్నారు. డిపో ఏర్పాటు చేశారు కానీ మేనేజర్ ఎక్కడా అని గ్యారేజి సిబ్బంది లేకుండానే డిపో నడుస్తుందా అన్న ప్రశ్నను లేవనెత్తుతున్నారు.

ఆఫీస్ స్టాఫ్ లేకుండా బస్సుల షెడ్యూల్ ఎలా అమలు జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. భీంగల్ డిపో ద్వారా జరుగుతున్న ఆర్టీసీ బస్సుల నిర్వాహణకు సంబంధించిన డబ్బును ఆర్మూర్ డిపోలో జమ చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. చివరకు ఆర్టీసీ బస్ డిపోలో సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో కండక్టర్లకు సెక్యూరిటీ డ్యూటీ వేశారన్న విమర్శలు చేస్తున్నారు. ఆర్టీసీ డిపోలో ప్రధానంగా ఉండాల్సిన ట్రాఫిక్ సూపర్ వైజర్, మెకానిక్ సూపర్ వైజర్ లేకుండా డిపో రన్ అవుతుందా అని సెటైర్లు వేస్తున్నారు. డిపో ప్రారంభించి ఉసురుమనిపించారని, గ్రామాలకు ఎందుకు సర్వీసులను పెంచడం లేదని ప్రశ్నిస్తున్నారు. నెల రోజుల క్రితం పూర్వపు ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో డిపోను అన్ని సౌకర్యాలతో ప్రారంభించి ఎన్నికల జిమ్మిక్కుతో భీంగల్ డిపోను ప్రారంభించారన్న ఆరోపణలు పెరిగాయి.


నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో చివరిసారిగా మూతపడ్డ భీంగల్ ఆర్టీసీ ఢిపోను తాను గెలిచిన వెంటనే పున:ప్రారంభిస్తామని 2014 ఎన్నికల సమయంలో వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. నష్టాలను కారణంగా చూపుతూ ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని ఆర్టీసీ డిపోలను మూసివేయగా అందులో భీంగల్ ఆర్టీసీ డిపో కూడా ఉంది. నాడు మూతపడ్డ ఆర్టీసీ డిపో కారణంగా బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు సేవలు లేకుండాపోయాయి. దాంతో పాటు హైదరాబాద్ లాంటి నగరాలకు భీంగల్ నుంచి బస్సులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రెండు ఉమ్మడి నియోజకవర్గాల్లోనూ గల్ప్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో పాటు అంతేగాకుండా రెండు నియోజకవర్గాల్లో ఎక్కువ సంఖ్యలో తాండలు ఉండడంతో కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పడిన వారికి రవాణా సౌకర్యం కరువైంది. ఈ నేపథ్యంలోనే బాల్కొండ నియోజకవర్గంలో పోటీ చేసే నాయకులు డిపోను తెరిపిస్తామని ఎన్నికల హామీగా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి డిపో ప్రారంభమౌతుందని ప్రజలు ఎదురుచూశారు. రెండుసార్లు గెలిచిన ప్రశాంత్ రెడ్డి ప్రజల నుంచి ఎక్కడ మళ్ళీ ఓట్ల సమయంలో ప్రశ్నిస్తారని ఈ నెలలోనే పాత భీంగల్ డిపోకు మెరుగులద్ది ప్రారంభించారు.

బాల్కొండ నియోజకవర్గంలో ప్రధాన ఎన్నికల హామీగా ఉన్న భీంగల్ డిపో పున:ప్రారంభం అయిందో లేదో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడంపై అధికార పక్షాల లీడర్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న సెటైర్లను బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ద్వారా ఎదుర్కొనేందుకు ప్రయత్నం జరుగుతుంది. డిపో ప్రారంభమైన పక్షం రోజులకే ఈ పరిస్థితి తలెత్తడంతో డిపో నిర్వాహణ గురించి ప్రజలకు తెలియజేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుండగా అధికార పక్షాల లీడర్లు డిపో విడతల వారీగా అన్నిసౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తారని చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా బాల్కొండ నియోజకవర్గంలో అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో దానిపై చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల వేళకు ముఖ్యంగా షెడ్యూల్ ఖరారుకు ముందే రాజకీయ వేడిని రాజుకునేలా చేస్తుంది.

బాల్కొండ నియోజకవర్గంలో డెవలప్ మెంట్ చేసామని చెప్పుకుంటున్న నాయకులు డిపో విషయానికొచ్చే సరికి ప్రతిపక్షాలకు ఊతమిచ్చేలా డిపో నిర్వాహణ ఉందన్న వాదనలు లేకపోలేదు. ప్రతిపక్షాలకు డిపో వ్యవహరం ప్రధాన ఏజండాగా మంత్రి ప్రశాంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ఒకింత కలవరానికి గురి చేస్తోంది. నియోజకవర్గంలో అన్నీ సవ్యంగా ఉన్న సమయంలో డిపోలో ఉన్నఫళంగా అన్ని రకాల సేవలు, సదుపాయాలు ఎన్నికల షెడ్యూల్ కు ముందు సాధ్యమౌతుందో లేదోనన్న సంశయాలున్నాయి. మంత్రిని ప్రతిపక్షాలు కారణం చేస్తున్న అధికార పక్షం దీటుగా జవాబు ఇవ్వలేకపోతుందన్న వాదనలున్నాయి.

Advertisement

Next Story