రెవెన్యూ శాఖలో రాబంధులు.. లంచం ఇవ్వకుంటే కదలని ఫైళ్లు

by Nagam Mallesh |
రెవెన్యూ శాఖలో రాబంధులు.. లంచం ఇవ్వకుంటే కదలని ఫైళ్లు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నో ఏళ్లుగా వేళ్లూనుకుని పాతుకుపోయిన లంచం జబ్బు రెవెన్యూ శాఖను ఇంకా వదలడం లేదు. తప్పుచేసి దొరికినా తప్పించేందుకు, అండగా ఉండి ఆదుకునేందుకు అధికార పార్టీ నేతలున్నారనే ధీమాతో లంచగొండి అధికారులు రెచ్చిపోతున్నారు. దీంతో ఏదైతే అదైంది.. అడ్డగోలుగా దోచేద్దాం.. సర్కారుకు దొరక్కుండా దాచేద్దాం.. అనే ఆలోచనతో అధికారులు లంచాలకు మరిగి ప్రజలను పీక్కు తింటున్నారు. పచ్చ నోట్లు చేతిలో పడందే ఏ ఫైలు అంగుళం కూడా ముందుకు కదలని పరిస్థితులు రెవెన్యూ శాఖలో ఉన్నాయంటే లంచాల సంస్కృతి ఆ శాఖలో ఏ స్థాయికి చేరుకుందో అర్ధం చేసుకోవచ్చు.

ఆత్మహత్యలు.. ఆత్మహత్యాయత్నాలు..

లంచగొండి అధికారుల వేధింపుల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న బాధితులు కొందరైతే, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారెందరో ఉన్నారు.

- తాజాగా సోమవారం కామారెడ్డి జిల్లాలో కొడప్ గల్ మండలం వడ్లం గ్రామానికి చెందిన అంజయ్య అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. పొలం పట్టా పాస్ బుక్ కోసం రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పండరి రూ.20 వేలు డిమాండ్ చేశాడని, డబ్బు ఇచ్చినా పట్టాదారు పాసు బుక్ మాత్రం ఇవ్వలేదని మనస్థాపానికి గురై తహశీల్దార్ కార్యాలయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

-ఇటీవల బోధన్ మండలంలోని సరిహద్దు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వ్యవసాయ భూమి విషయమై తహశీల్దార్ కార్యాలయం ఎదుట భార్యతో కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. రెవెన్యూ అధికారులు లంచం ఇచ్చినా పని చేయడం లేదనేది వారి ఆరోపణ.

-భూమి సమస్యను పరిష్కరించకుండా లంచాల కోసం వేధిస్తున్నారని నాలుగేళ్ల క్రితం డిచ్ పల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి పాత కలెక్టరేట్ వద్ద చెట్టెక్కి నైలాన్ తాడుతో ఉరేసుకోడానికి ప్రయత్నించాడు.

తప్పు చేసేది అధికారులు.. శిక్షలు రైతులకు

రెవెన్యూ రికార్డుల్లో వివరాలు అడ్డగోలుగా నమోదు చేసి తప్పు చేసింది అధికారులైతే శిక్షలు మాత్రం రైతులు అనుభవిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ధరణిలో దొర్లిన తప్పులను సరిదిద్దడానికి కూడా ఎంఆర్ఐలు, తహసీల్దార్లు ముడుపులు డిమాండ్ చేస్తున్నారు. పైసలివ్వందే ఫైలు చూడటం లేదనే ఫిర్యాదులు ఉమ్మడి జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయాల్లో వెల్లువలా వస్తున్నాయి. కింది స్థాయి సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే నిట్టూర్పులు వినిపిస్తున్నాయి.

భీంగల్ తహసీల్డార్ ఆఫీసులో అవినీతి అనకొండలు

జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాలన్నీ ఒక ఎత్తయితే, భీంగల్ మండల తహసీల్దార్ కార్యాలయం మరో ఎత్తు అని జిల్లాలో టాక్ ఉంది. ఊరికి దూరంగా జనసంచారం అసలే లేని ప్రాంతంలో ఉన్న తహశీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. ఆఫీసు ముగిశాక రాత్రి దాకా కార్యాలయంలో జరిగే పనులన్నీ ముడుపుల ముచ్చట్లేనన్నది బహిరంగ రహస్యం. పైరవీకార్లతో సాయంత్రం ఆఫీసు సందడిగా ఉంటుంది.

డబుల్ ఇళ్లల్లో కూడా అధికారుల కక్కుర్తి..

గత ప్రభుత్వం పేద కుటుంబాలకు పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూం ఇళ్లలోనూ వీరి అవినీతి పరాకాష్టకు చేరింది. అర్హులకు దక్కాల్సిన డబుల్ బెడ్ రూం ఇళ్లను అనర్హులకు కట్ట బెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. డబుల్ ఇళ్లకు అర్హులను గుర్తించే అధికారాన్ని రెవెన్యూ శాఖకు కట్టబెట్టడం వారికి వరంగా మారింది. ఒక్కో ఇంటికి రూ. 20 వేల నుంచి రూ. 30 వేలు ముడుపులుగా తీసుకుని ఎంతో మంది అనర్హులకు డబుల్ ఇళ్లు మంజూరు చేసిన ఘనత రెవెన్యూ శాఖ ఉద్యోగులకు మాత్రమే దక్కింది. భీంగల్ మండల కేంద్రంలో, బడా భీంగల్ లో గత ప్రభుత్వం డబుల్ ఇళ్లను నిర్మించింది. వీటి మంజూరులో ముడుపులకే పెద్ద పీట వేసిన అధికారులు అర్హుల్లో చాలా మందిని పక్కకు నెట్టి ముడుపులిచ్చిన వారికే ఇంటి తాళాలు ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు అండగా ఉన్నారనే ధైర్యంతో ఇష్టారీతిన అనర్హులకు కట్టబెట్టి లక్షలు వెనకేసుకున్నారనే ఆరోపణలున్నాయి. రెవెన్యూ శాఖలో పెచ్చుమీరిన అవినీతికి అడ్డుకట్ట వేసి రెవెన్యూ ఆధికారుల వేధింపుల నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన, ఉన్నతాధికారులపై ఉంది.

Advertisement

Next Story

Most Viewed