మాటలతోనే మమా అనిపిస్తున్న ఆర్టీసీ.. కనీస సౌకర్యాలకు నోచుకోని బస్‌స్టేషన్

by Disha News Desk |
మాటలతోనే మమా అనిపిస్తున్న ఆర్టీసీ.. కనీస సౌకర్యాలకు నోచుకోని బస్‌స్టేషన్
X

దిశ, పిట్లం : ప్రయాణికులే మా సంస్థకు నిధి.. వారిని గౌరవించడం మన విధి అంటూ పెద్ద పెద్ద సామెతలు రాస్తున్న ఆర్టీసీ అధికారులు.. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు అందించడంలో మాత్రం విఫలమయ్యారు. పిట్లంలోని మండల కేంద్రంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ అధ్వానంగా తయారైంది. కనీస వసతులు మరుగుదొడ్లు, మూత్రశాలలు సైతం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాక బస్టాండ్ ప్రాంగణం శిథిలావస్థకు చేరి.. పైకప్పు పెచ్చులూడుతున్నా ఆర్టీసీ అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూత్రశాలల నిర్మాణం చేపట్టకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్‌లో మౌలిక సదుపాయాలు కల్పించక పోవడం అధికారులు, పాలకుల అలసత్వంగా ప్రయాణికులు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా ఇదేతంతు కొనసాగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా టికెట్ ధరలు పెంచడంలో ఉన్న ఉత్సాహం ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం ఆర్టీసీ చూపడం లేదని, ప్రజల సమస్యలపట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు దయతలచి మండల కేంద్రంలోని బస్టాండ్‌లో కనీస మౌలిక వసతులు కల్పించి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని మహిళా ప్రయాణికులు కోరుతున్నారు.

స్వీపర్‌ను నియమించాలి

బస్టాండ్ ఆవరణలో శుభ్రం చేసే వారు లేక పోవడంతో.. చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గందం వస్తోంది. ఈ వాసన ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉన్నా అదికారులు పట్టించుకోవడం లేదు. దాంతో పాటుగా వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి సమయాల్లో బస్సుల రాక కోసం నిల్చునే ప్రయాణికులు భయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బస్ స్టేషన్‌లో మైలిక సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed