టౌన్ ప్లానింగ్ అధికారులకు అధికార పార్టీ అండ..

by Sumithra |   ( Updated:2023-06-29 14:57:26.0  )
టౌన్ ప్లానింగ్ అధికారులకు అధికార పార్టీ అండ..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో కంఠేశ్వర్ ప్రాంతంలో ఓ వివాదాస్పద స్థలంలో ఓ విద్యాసంస్థ చేపట్టే నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరించిన తీరుపై వివాదాస్పదమైంది. సంబంధిత స్థలం ఆరు ఎకరాలు ఉండగా ప్రైవేట్ విద్యా సంస్థ రెండు ఎకరాలకు మాత్రమే బెటర్ మెంట్ చార్జీలు చెల్లించే విధంగా రూపొందించిన ఫైలు వ్యవహరం నగరంలో చర్చనీయాంశంగా మారింది. సంబంధిత భూమిని మొత్తం డెవలప్ మెంట్ కొరకు నలా కన్వర్షన్ కింద వీఎల్ టీ చెల్లించాలి.

అలా చెల్లిస్తే కార్పొరేషన్ కు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ అవినీతిలో మునిగి తేలుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఏకంగా రెండు ఎకరాలకు మాత్రమే బెటర్ మెంట్ చార్జీలతో అనుమతి ఫైల్ ను కదలించడం కలకలం రేపుతుంది. సాధారణంగా డెవలప్ మెంట్ జరిగే భూమికి సంబంధించి మార్కెట్ కమిటీ ధరలకు అనుగుణంగా 14 శాతం చెల్లించాలి. కానీ నామమాత్రం ఫీజుతో ఫైల్ ను ముందుకు కదపడం టౌన్ ప్లానింగ్ అధికారుల చేతిలో ఫైల్ పడితే ఏ విధంగా బల్ధియాకే రావాల్సిన సొమ్మును గండికొడుతూ సొంత లాభం చూసుకుంటున్న వ్యవహరం పై అంతా కోడై కూస్తోంది.

నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ వాగు ప్రక్కన ఉన్న ఓ ప్రైవేట్ స్థలం విషయంలోనూ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇదే తీరుగా వ్యవహరించారు. నలా కన్వర్షన్ తీసుకున్న తర్వాత చెల్లించే వీఎల్ టీ చార్జీలు కోటి 90 లక్షలుగా ముందు నిర్ధారించారు. దాని ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి సూచనలు చేశారు. తర్వాత బ్యాక్ విండో ద్వారా వచ్చిన అదే యాజమాన్యానికి మరోసారి పర్మిషన్ కు కేవలం 95వేలు మాత్రమే వసూల్ చేసి అనుమతినివ్వడం గమనార్హం. ఈ విషయంలో దాదాపు మున్సిపల్ కార్పొరేషన్ కోటి రూపాయల ఆధాయాన్ని కోల్పోయింది. నగర నడిబొడ్డున జరిగిన ఈ వ్యవహరంలో టౌన్ ప్లానింగ్ అధికారుల విషయం అందరికీ తెలిసినా చర్యలు మాత్రం తీసుకోలేదు. దానితో ఇప్పుడు సంబంధిత ప్రాంతంలో ఏకంగా నిర్మాణ పనులు జరుగుతుండడం విశేషం.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుకు అధికార పార్టీ నాయకుల అండనే ప్రధాన కారణమన్న వాదనలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం అనుమతులు ఇచ్చి బల్ధియాకు ఆదాయాన్ని పెంచాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులకు బీఆర్ఎస్ అధికారులు తమ చెప్పు చేతుల్లో ఉంచుకుని కార్పొరేషన్ ఆదాయానికి గండికొడుతూ సొంత ఆదాయాన్ని పెంచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. నేరుగా దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులు రావడం అన్నది కష్టంగా ఉంది. లీడర్లను పట్టుకుని దరఖాస్తు చేస్తే ప్రభుత్వానికి ప్రధానంగా బల్ధియా ఆదాయానికి గండికొట్టయిన సొంత లాభం చూసుకోవడం పరిపాటిగా మారింది.

ఒకరిద్దరు బిల్డర్లను లైసెన్స్ డ్ ఇంజనీర్లను మధ్యవర్తిగా పెట్టి ఈ తతంగాన్ని నడుపుతున్నారని ఆరోపణలున్నాయి. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ అధికారులను ప్రశ్నించిన నిబంధనల ప్రకారం కట్టుకున్న వాణిజ్య, ఇంటి నిర్మాణాలను రూల్ ప్రకారం లేవని, పర్మిషన్ రిజక్ట్ చేయడంతో పాటు అనుమతులు ఇవ్వడం అటుంచి కూల్చివేస్తారన్న అపవాదు మూటగట్టుకుంది. కొన్ని ఏరియాలకు టౌన్ ప్లానింగ్ అధికారులు వెళ్లాలంటే ముందుగా లీడర్ల పర్మిషన్ ఉండాలన్న పరిస్థితి నెలకొంది. కంఠేశ్వర్ లో కొత్తగా టౌన్ ప్లానింగ్ అధికారులు వీఎల్టీ చార్జీలను తగ్గించి పర్మిషన్ కు ఫైల్ ను ముందుకు కదుపడం వెనుక బీఆర్ఎస్ లీడర్లే ఉన్నారని బల్ధియా కోడై కూస్తోంది.

Advertisement

Next Story

Most Viewed