Government Junior College : పేద విద్యార్థులం మాకు చదువు చెప్పండి.. మహాప్రభో..

by Sumithra |   ( Updated:2024-08-06 14:50:44.0  )
Government Junior College : పేద విద్యార్థులం మాకు చదువు చెప్పండి.. మహాప్రభో..
X

దిశ, నాగిరెడ్డిపేట్ : మేము పేద విద్యార్థులం, ప్రైవేటు కళాశాలలో ఫీజులు కట్టే స్తోమత లేక, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి చదివి ప్రయోజకులం అవుదాం అనుకుంటే ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం, పాలకుల తీరుతో ప్రభుత్వ కళాశాలకు ప్రభుత్వం అధ్యాపకులను మంజూరు చేయకపోవడంతో ప్రభుత్వ కళాశాల ఐదు రోజులుగా మూతపడి ఉంది. విసిగి వేసారిన ప్రభుత్వ కళాశాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వం, అధికారుల తీరును నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు. ఈ సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో జరిగింది. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని మొదటిసారి మంజూరైన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభమైన కొద్ది రోజులకే కళాశాలకు అధ్యాపకులు రాక గత ఐదు రోజులుగా మూతపడింది. దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్ల కార్డులు చేతబట్టి మండల కేంద్రంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాల ఎదుట బోధన్ - హైదరాబాద్ ప్రధాన రహదారి పై బైఠాయించి అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ నాగిరెడ్డిపేట మండలానికి గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు అయ్యిందని, కళాశాలలో 40 మంది విద్యార్థులు చేరగా, గత ఐదు రోజుల నుండి కళాశాలకు అధ్యాపకులు రాక పోవడంతో విద్యార్థులు ప్రతిరోజు ఉదయం వచ్చి మధ్యాహ్నం వరకు అధ్యాపకుల కోసం నిరీక్షించి, నిరీక్షించి వెనుదిరికి వెళ్ళిపోతున్నామని, కళాశాలకు ప్రభుత్వం అధ్యాపకులను నియమించకపోవడంతో తాము విద్యను అభ్యసించలేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అధ్యాపకులను నియమించక నిర్లక్ష్యం వహిస్తున్న జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారిని వెంటనే ప్రభుత్వం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

రాస్తారోకో వద్దకు స్థానిక పోలీసులు వచ్చి విద్యార్థులను సముదాయించి రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం విద్యార్థులు తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, నాగిరెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాలకు అధ్యాపకులను నియమించేలా చర్యలు చేపట్టాలని, విద్యార్థుల సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ తహశీల్దార్ లక్ష్మణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు, నాగిరెడ్డిపేట ప్రభుత్వ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed