ఆలూరు బైపాస్ రోడ్డు దివంగత యాల్ల రాములు కల.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

by Javid Pasha |
ఆలూరు బైపాస్ రోడ్డు దివంగత యాల్ల రాములు కల.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
X

దిశ ఆర్మూర్: ఆలూరు బైపాస్ రోడ్డు నిర్మించి ఆటో కూడా తిరగలేని ఇరుకు రోడ్ల కష్టాల నుంచి, కాలుష్యం చెర నుంచి ప్రజలను బయట పడేయాలన్నది దివంగత నేత యాల్ల రాములు కల అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ లోని ఆలూరు బైపాస్ రోడ్ లో శుక్రవారం దివంగత నేత యాల్లరాములు నిలువెత్తు విగ్రహాన్ని జీవన్ రెడ్డి ఆవిష్క రించారు. జీవన్ రెడ్డి కి స్వయాన మేన మామ అయిన యాల్ల రాములు 1994 సంవత్సరంలో ఆర్మూర్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆ పదవిలో ఉన్న సమయంలోనే 1996వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తి పుణ్యక్షేత్రంకు వెళ్లిన యాల రాములు తిరుగు ప్రయాణంలో కర్నూలు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆ దుర్ఘటనలో రాములుతో పాటు ఆయన సతీమణి యాల్ల రమాదేవి, కారు డ్రైవర్ రమా గౌడ్ లు కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే.

ఆర్మూర్ ప్రాంతంలో మంచి రాజకీయ నేతగా ప్రజాభిమానం పొందిన రాములు విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించిన ఆయన కుమారుడు నరేందర్ రెడ్డి.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో ఆలూరు బైపాస్ రోడ్డులో నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాములు విగ్రహం వద్ద ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆయన సతీమణి రజితారెడ్డి లతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఘనంగా నివాళులర్పించారు. విగ్రహ ప్రతిష్టాపన చేసిన అనంతరం జీవన్ రెడ్డి ఇదే రోడ్డులో యల్లా రాములు బస్టాప్ ను ప్రారంభించారు. తరువాత బైపాస్ రోడ్డుకిరువైపులా ఏర్పాటు చేసిన హైమాక్స్ లైటింగ్ సిస్టంను, సీసీ కెమెరాల విభాగాన్ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా జరిగిన భారీ సభలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. స్వయాన తన మేనమామ అయిన దివంగత నేత రాములు స్ఫూర్తితో ముందుకు సాగుతానన్నారు. ఆలూరు బైపాస్ రోడ్డు నిర్మించాలన్న రాములు మామ కలను సాకారం చేసి రుణం తీర్చుకున్నానని,ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో ఆలూరు రోడ్డు వేయించినట్లు చెప్పారు. మొదట భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరించి, నిరసనగా ధర్నాలు, దీక్షలు చేశారు. బైపాస్ రోడ్డు వస్తే భూముల ధరలు పెరుగుతాయని రైతులకు నచ్చ చెప్పినట్లు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడి నష్టపరిహారం పెంచామని, నేను అధికారులు రైతులను ఒప్పించి, మెప్పించి బైపాస్ రోడ్డు కోసం భూసేకరణ పూర్తి చేశామన్నారు.

ఆలూరు రోడ్డు నిర్మాణం విశాలంగా జరిగింది. రోడ్డుకిరువైపులా లైట్లు, సీసీ కెమెరాల ను ఏర్పాటు చేయించామన్నారు.ఈ బైపాస్ రోడ్డు నిర్మాణంతో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోగా, రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. మా రాములు మామ ఆత్మ శాంతించింది అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. పుట్టుక నీది చావు నీది, బతుకంతా దేశానిది అన్న విధంగా దివంగత రాములు బతికినంత కాలం ప్రజల కోసమే పరితపించారన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి ఆయన ముందుండే వారన్నారు. ఆర్మూర్ అభివృద్ధిలో రాములు పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. మా మేనమామ అయిన దివంగత రాములు స్పూర్తితో ముందుకు సాగుతానని జీవన్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి, ఆయన సతీమణి రజితారెడ్డి లు కలిసి వేదికపైన దివంగత నేత రాములు కుటుంబ సభ్యులను, బంధు మిత్రులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను ప్రదానం చేశారు.

ఇదిలావుండగా ఈ రోడ్డుకు యల్లా రాములు బైపాస్ రోడ్డుగా, ఆలూరు చౌరస్తాకు యల్లా రాములు చౌక్ గా నామకరణం చేశారు. కాగా అక్కడ అభిమానుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లను జీవన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, మాజీ జడ్పీటీసీ గంట సదానందం, మాజీ సర్పంచ్ కొంగి సదశివ్ , మున్సిపల్ ఛైర్పర్సన్ పండిత్ వినిత పవన్, వైస్ చైర్మన్ షేక్ మున్ను, డాక్టర్ శంకర్, బీఆర్ కే రాజు, కటిపెళ్లి వెంకట్ రెడ్డి , గంగారెడ్డి, దివంగత యాల్ల రాములు కుటుంబ సభ్యులు యల్ల నరేందర్ రెడ్డి దంపతులు, అల్లూరి తారారెడ్డి దంపతులు, ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి-రేవతి రెడ్డి దంపతులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed