మాక్లూర్ ఐఎంఎల్ డిపో నుంచే మద్యం కొనుగోలు చేయాలి

by Sridhar Babu |
మాక్లూర్ ఐఎంఎల్ డిపో నుంచే మద్యం కొనుగోలు చేయాలి
X

దిశ, ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లైసెన్సులు పొందిన మద్యం దుకాణదారులు మాక్లూర్ ఐఎంఎల్ డిపో నుంచి మాత్రమే మద్యాన్ని కొనుగోలు చేయాలని ఆర్మూర్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ స్టీవెన్సన్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం లైసెన్సులు పొందిన దుకాణదారులు ఇతర ప్రాంతాల నుంచి మద్యాన్ని తీసుకువచ్చినట్లయితే ఆ విషయాన్ని ప్రజలు ఎక్సైజ్ అధికారులకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం దుకాణదారులపై, బార్ల నిర్వాహకులపై నిరంతర నిఘా పెట్టినట్లు తెలిపారు.

యజమానులు మద్యాన్ని కల్తీ చేయకుండా నిరంతరంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా చెక్ పోస్టుల నిర్వహణతో ఇతర రాష్ట్రాల నుండి మద్యం మన ప్రాంతంలోకి రాకుండా నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్మూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 21 కేసులు నమోదయ్యాయని, ఈ కేసుల్లో 14 మంది అరెస్టు అయ్యారని పేర్కొన్నారు. 64 లీటర్ల మద్యం, 20 లీటర్ల బీర్లు, 17 లీటర్ల సారా, 1400 లీటర్ల బెల్లం పానకం, 1000 లీటర్ల కల్లు, 4 వాహనాలను సీజ్​ చేసినట్టు వెల్లడించారు.

Advertisement

Next Story