Punjab: పంజాబ్ లో పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత

by Shamantha N |
Punjab: పంజాబ్ లో పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లో పంచాయతీ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్‌ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఒకరికి బుల్లెట్ గాయమైంది. ఆప్‌ నాయకుడు మన్‌దీప్‌ సింగ్‌ బ్రార్‌కి బుల్లెట్ గాయమైనట్లు పోలీసులు తెలిపారు. అకాలీ దళ్‌ నాయకుడు వర్దేవ్‌ సింగ్‌ మాన్‌ ఓ పాఠశాలకు సంబంధించిన ఫైల్‌ గురించి బీడీపీఓ కార్యాలయానికి వెళ్లారు. కాగా.. ఆ ఫైల్‌ను చూసేందుకు అధికారులు నిరాకరించడంతో వెనుదిరిగారు. ఈ క్రమంలో బయట ఉన్న ఆప్‌ నేత మన్‌దీప్‌ సింగ్‌ బ్రార్‌తో వర్దేవ్ సింగ్ మాన్ వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలగొంది. మన్‌దీప్‌ శరీరంలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. వెంటనే అతడ్ని జలాలాబాద్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అకాలీ పార్టీ నాయకులే ఈ ఘటనకు కారణమని ఆప్‌ అధికార ప్రతినిధి మల్వీందర్‌ సింగ్‌ కాంగ్‌ ఆరోపించారు. పంచాయితీ ఎన్నికల సమయంలో ఎస్‌ఏడీ పార్టీ దాడులకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. మరోవైపు, పంజాబ్‌ వ్యాప్తంగా ఈనెల 15న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 13వేలకు పైగా సర్పంచి స్థానాలకు పోలింగ్ జరగనుంది.

Advertisement

Next Story