ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం తగదు..

by Sumithra |
ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం తగదు..
X

దిశ, ఆర్మూర్ : ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వానికి తావులేకుండా యుద్దప్రాతిపదికన పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం సందర్శించి, ధరణి దరఖాస్తుల పరిశీలన, వాటి పరిష్కారం తీరు పై స్థానిక రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపారు. ఆర్మూర్ మండలం పరిధిలో ఆయా మాడ్యూల్స్ లో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులు ఎన్ని, వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు. ఒకింత ఎక్కువ సంఖ్యలో ధరణి దరఖాస్తులు పెండింగ్ లో ఉండడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరణి దరఖాస్తుల పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని గత నెల రోజులుగా సూచిస్తున్నప్పటికీ, వాటి పరిష్కారం విషయంలో ఎందుకు శ్రద్ధ చూపడం లేదని అధికారులను నిలదీశారు.

క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, రికార్డుల ఆధారంగా దరఖాస్తులను వెంటదివెంట పరిష్కరించేందుకు చొరవ చూపాలని, స్పెషల్ డ్రైవ్ చేపట్టి పెండింగ్ దరఖాస్తులన్నింటిని క్లియర్ చేయాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు బృందాలను నియమించుకుని క్షేత్రస్థాయి విచారణ జరపాలని, తప్పిదాలకు ఆస్కారం లేకుండా వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికను నిబంధనలకు అనుగుణంగా రూపొందించి ఆర్డీఓ లాగిన్ కు ఫార్వార్డ్ చేయాలని అన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన ప్రగతి గురించి రోజువారీగా నిశిత పరిశీలన జరపాలని ఆర్డీఓకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఆర్మూర్ తహశీల్దార్ గజనాన్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

Next Story

Most Viewed