Kalvakuntla Chandrashekar Rao : కేసీఆర్ సర్కార్ హ్యాట్రిక్ విజయం ఖాయం

by Sridhar Babu |   ( Updated:2023-10-25 13:09:17.0  )
Kalvakuntla Chandrashekar Rao : కేసీఆర్ సర్కార్ హ్యాట్రిక్ విజయం ఖాయం
X

దిశ, నవీపేట్ : తెలంగాణ లోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పాటుబడిన సీఎం కేసీఆర్ కు తెలంగాణ ప్రజానీకం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధిస్తారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండలంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత కార్యక్రమం మీద బుధవారం తన బంధువుల ఇంటికి రాగా స్థానిక మీడియా ప్రతినిధులు ఆయనతో ముచ్చటించారు. తన తల్లి మరణానంతరం మొదటి సారి బయటకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని,సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో హ్యాట్రిక్ విజయం ఎప్పుడో ఖాయమైందని అన్నారు. అస్తవ్యస్తమైన కరెంట్ తో తెలంగాణ ప్రజలు గోసలు పడ్డారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ సుమారు లక్ష కోట్లతో కరెంట్ వ్యవస్థను గాడిలో పెట్టాడని తెలిపారు.

రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్, గృహ అవసరాలకు, పరిశ్రమలకు నిరంతరాయంగా కరెంట్ సరఫరా అవుతుందన్నారు. రైతుకు రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, సకాలంలో ఎరువులు ఇచ్చి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు బాంధవుడుగా నిలిచారని కొనియాడారు. సీఎం కేసీఆర్ సర్కార్ రైతుల కోసం చేస్తున్న కార్యక్రమాలు చూసి వ్యవసాయ రంగ నిపుణులు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. రూ. 200 ఉన్న పెన్షన్ ను 2 వేలు చేసిన ఘనత కేసీఆర్ దే అని, దాన్ని 5వేలకు పెంచుతామని, భూమి ఉన్న వారికి రైతు బీమా ఎలా వస్తుందో అట్లాగే తెల్ల రేషన్ కార్డులు కలిగిన భూమి లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల కేసీఆర్ బీమా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు దారులకు అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యం అందించనున్నట్లు తెలిపారు. అర్హురాలైన పేదింటి మహిళకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద నెలకు 3వేల చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు. ఏ కార్పొరేట్ హాస్పిటల్ లో అయినా 15 లక్షల విలువైన ఉచిత వైద్యం పేదలకు అందుతుందని అన్నారు.

కేసీఆర్ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను హత్తుకునే సూపర్ డూపర్ మేనిఫెస్టో అని తెలిపారు. బీఆర్ఎస్ తెలంగాణ బాగు కోసం తాపత్రయ పడుతుంటే బీజేపీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం కోసం అడ్డమైన నిరాధార ఆరోపణలు చేస్తూ కేసీఆర్ ని విమర్శించే పని పెట్టుకున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు రాష్ట్ర సాధన కోసం పోరాడి, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కేసీఆర్ ఒక వైపు ఉంటే..ఓటు కు నోటు కేసులో పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన దొంగ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే అమెరికా పారిపోయిన బీజేపీ కిషన్ రెడ్డి మరోవైపు ఉన్నారని అన్నారు. కేసీఆర్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఆయన కాలిగోటికి కూడా సరిపోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చెప్పింది చేస్తాడని ప్రజలకు నమ్మకముందని అన్నారు. కళ్యాణ లక్ష్మి,

కేసీఆర్ కిట్, రైతు బంధు, బీమా లాంటి ఎన్నో మానవీయ కోణ పథకాలు హామీ ఇవ్వకుండానే పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టి అమలు చేశారన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. బోధన్ లో ఎమ్మెల్యే షకీల్ విజయం ఖాయమైందని, మేనిఫెస్టో తర్వాత 50 వేల మెజారిటీ వస్తుందనే నమ్మకం ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఎంత అరిచి గీ పెట్టినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed