కాళేశ్వరం పర్రెల కాడ సెల్పీలు దిగుతూ వస్తుపోతుండ్రు

by Sridhar Babu |
కాళేశ్వరం పర్రెల కాడ సెల్పీలు దిగుతూ వస్తుపోతుండ్రు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్రెలు వచ్చిన విషయం తెల్సిందేనని, కాంగ్రెస్ నాయకులు అక్కడికి పోతుండ్రు సెల్పీలు దిగుతూ వస్తుండ్రు కానీ దానిపై తమ విధివిధానాలు ఏమిటో చెప్పడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదని మండిపడ్డారు. మంగళవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణతో కలిసి ధర్మపురి అరవింద్ విలేకరులతో మాట్లాడుతూ పసుపు బోర్డు విషయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

ప్రపంచంలోనే అసాధారణ నేతల్లో ఒకరైన మోడీ నిజామాబాద్ జిల్లాకు వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, అవి విధి విధానాల ప్రకారం జరుగుతున్నాయని, అందుకు సంబంధించిన గెజిట్ కూడా విడుదలైన విషయం తెలియంది కాదన్నారు. తుమ్మల నాగేశ్వర్ రావు తెలుగుదేశం మంత్రిగానే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన ఫక్తు పార్టీలు మారడం వల్ల ఆయన ఏ పార్టీలో ఉన్నది గుర్తించలేని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ హయంలోనే పసుపు రైతులు అథోగతి పాలయ్యారన్నారు. దేశంలో పసుపు ధరలు నిర్ణయించేది మార్కెట్లో డిమాండ్ సప్లయ్ సూత్రమేనన్న విషయం తెలియదా అని అన్నారు. దేశంలో పసుపు విస్తీర్ణం పెరిగిందని, తెలంగాణలో తగ్గిందనడం ఆయనకు పసుపు పై విషయ పరిజ్ఞానం లేకపోవడమేనని ఆరోపించారు.

కాంగ్రెస్ హయంలోనే తెలంగాణలో ఏర్పాటు కావాల్సిన పసుపు బోర్డు స్థానంలో కేరళలో స్పైస్ బోర్డు ఏర్పాటు చేశారని, అక్కడ ఒక్క శాతం కూడా పసుపు పండదని గుర్తు చేశారు. తెలంగాణలో పసుపు విస్తీర్ణం తగ్గడానికి, మహారాష్ట్రలో పెరుగడానికి అక్కడ సేంద్రియ ఎరువులు తక్కువ ధరకు లభించడం, వ్యవసాయ కార్మికుల కూలి రేట్లు తక్కువ అన్న విషయం గమనించాలన్నారు. ఇక్కడ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ కార్మికులు లభించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అరవింద్ డిమాండ్ చేశారు. చంద్రబాబు మంత్రి వర్గంలో పని చేసిన తుమ్మల నాగేశ్వర్ రావుకు ఆయన హయాంలోనే నిజాం చక్కెర కర్మాగారం ప్రైవేట్ పరమైందని తెలియదా అని ప్రశ్నించారు.

ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చక్కెర కర్మాగారం తెరిచేందుకు హౌజ్ కమిటీని ఏర్పాటు చేస్తే దానిని అటకెక్కించింది కాంగ్రెస్ నాయకులేనని మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి నానాటికీ ప్రజల నుంచి పార్టీ నాయకుల నుంచే ఆదరణ కరువైందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఒకప్పుడు ముఖ్యమంత్రి కూడా బీజేపీలోకి చేరుతున్నారని, దానిని కాంగ్రెస్ నాయకులు పరిశీలించి తమ తప్పిదాలను గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరు ఔరంగాజేబు పాలనను తలపిస్తుందన్నారు.

ఇటీవల వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ శివాజీ జయంతి ఉత్సవాలను నిర్బంధంలో కొనసాగించిందని అన్నారు. రెండ్రోజుల క్రితం శివాజీ జయంతి సందర్భంగా ర్యాలీ కోసం దరఖాస్తు చేస్తే పోలీసు కమిషనర్ అనుమతివ్వలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ నగరానికి వస్తే ఆరు గంటల ర్యాలీ ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. అందుకు అనుమతులు తాము ఇవ్వలేదని చెప్పడం విడ్డూరమన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, మహిళ మోర్చా అధ్యక్షురాలు ప్రవళిక, లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed