ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు

by Sridhar Babu |

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో పంద్రాగస్టు కార్యక్రమాలు కొనసాగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన చైర్మన్ అనిల్, పుర ప్రముఖులను, అధికార, అనధికారులను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న

కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా కొనసాగిన శకటాల ప్రదర్శనను తిలకించారు. వ్యవసాయ, జిల్లా పంచాయతీ విభాగం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ, పౌర సరఫరాల శాఖ, వైద్యారోగ్యం తదితర శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి తెలియజేస్తూ, ఆకట్టుకునే రీతిలో శకటాల ప్రదర్శన కొనసాగింది. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. వివిధ పథకాల కింద మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని కార్యక్రమంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలరింపజేశాయి. ఎదనిండా దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. మోపాల్,

నందిపేట్ కస్తూర్బా పాఠశాలల బాలికలతో పాటు నవీపేట్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు దేశభక్తి గేయాలపై ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి అనిల్ ఈరవత్రి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందిస్తూ,వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అర్వింద్ ధర్మపురి, అర్బన్ , రూరల్ ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్.భూపతి రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, నగర మేయర్ నీతూకిరణ్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, రాష్ట్ర సహకార ఫెడరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెవార్, జిల్లా జడ్జి కె.సునీత, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరందు, ట్రైనీ కలెక్టర్ సంకేత్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed