మోడీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు 400 దాటుతాయి

by Sridhar Babu |   ( Updated:2024-05-07 15:38:08.0  )
మోడీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు 400 దాటుతాయి
X

దిశ ప్రతినిది, నిజామాబాద్ : ప్రధాని మోడీ పదేళ్ల కాలంలో అచ్చే దిన్ రాలేదు కానీ ప్రజలు సచ్చేదిన్ వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి అబ్ కీ బార్ 400 పార్ అని ప్రచారం చేస్తున్నారని, అదంతా ఉత్తిదేనని, మోడీ ప్రధాని అయితే మాత్రం ఈసారి పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ రూ.400 దాటడం ఖాయమని కేసీఆర్ అన్నారు. మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. స్థానిక నిజాంసాగర్ చౌరస్తా నుంచి జేపీఎన్ రోడ్ వరకు రోడ్ షో సాగింది. చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేశారు. మోడీ పదేళ్ల కాలంలో 150 హామీలిచ్చినా ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. బీజేపీ పేదల పార్టీ కాదని దోపిడీ దారిల పార్టీ అని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్లు ప్రధానమంత్రి ధన్ యోజన కింద కామారెడ్డి నియోజకవర్గం వారికి 30 లక్షలు వచ్చాయా అని ఆరా తీశారు. బీజేపీ అభ్యర్థులు గెలిచిన చోట మోడీ హామీ ఇచ్చినట్లు కనీసం 15 లక్షలు కూడా ఇవ్వలేదు అన్నారు. మోడీ హయాంలో తెలంగాణలో ఒక్క నవోదయ విద్యాలయం కూడా ఇవ్వలేదని, మెడికల్ కాలేజీ కేటాయించలేదని అన్నారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను

ఆంధ్రాలో విలీనం చేయడంతో పాటు సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రాకు అప్పగించారన్నారు. మోడీకి తెలంగాణ అంటే ఎప్పుడు అక్కసేనని, అందుకే తెలంగాణ ఏర్పాటును తల్లిని చంపి బిడ్డను బతికించారని పలుమార్లు వ్యాఖ్యానించాడని కేసీఆర్ గుర్తు చేశారు. మోడీ హయాంలో తెలంగాణను ఎలాంటి మేలు జరుగలేదని, కృష్ణా, గోదావరి నదులను తరలించుకపోయేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, మోడీ ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ గెలవాలని అన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అబద్దపు హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లా ఉండాలనా, పోవాల్నా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా తీసేస్తా అంటున్నాడు, కాపాడుకుందామా లేదా అని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గెలవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలలో ఒక్కటైనా అమలైందా అని, కళ్యాణలక్ష్మీ కింద తులం బంగారం ఇచ్చారా అని, రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగిందా అని, రైతుభరోసా అని చెప్పినా రేవంత్ రెడ్డి వరి ధాన్యానికి 500 బోనస్ ఇచ్చాడా అని అడిగారు. బీఆర్ఎస్ హయాంలో 9 సంవత్సరాల కాలంలో కరెంట్ కోతలు లేవని,

మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించామని అన్నారు. ఆడబిడ్డలకు 2,500 ఇచ్చాడా, నిరుద్యోగులకు యువ వికాసం పేరిట 4 వేల నిరుద్యోగ భృతి అందుతుందా అని ఆరా తీశారు. అసమర్థులు, తెలివి తక్కువ వారు పరిపాలిస్తే పాలన ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. యువతులకు గెలిచిన వెంనే స్కూటీలు ఇచ్చారా అని లూటీలు మాత్రం మొదలయ్యాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోగానే కట్ కా బంద్ చేసినట్లు సంక్షేమ పథకాలన్నీ బంద్ అయ్యాయని అన్నారు. ఐటీ రంగం, పారిశ్రామిక రంగం కుదేలయిందని, వెయ్యి కోట్ల ఫ్యాక్టరీ మద్రాసుకు తరలిపోయిందని అన్నారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని కేసీఆర్ అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ లు గెలిచేది లేదని బీజేపీ మూడవ స్థానంలో ఉందని కేసీఆర్ జోష్యం చెప్పారు. రాష్ట్రంలో 14 స్థానాలను బీఆర్ ఎస్ పార్టీ గెలుస్తుందని అన్నారు. ఈ రోడ్ షోలో మాజీ సభాపతి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ విప్ గంప గోవర్దన్, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, పార్టీ జిల్లా అధ్యక్షులు ముజిబుద్దీన్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story