ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకం.. గోశాలలో గో సేవ..

by Sumithra |
ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకం.. గోశాలలో గో సేవ..
X

దిశ, ఆర్మూర్ : పాశ్చాత్య సంస్కృతిని పాటిస్తూ యువతి, యువకులు మంగళవారం జరుపుకుంటున్న ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి దేవాలయ గోశాలలో గోవులకు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ నేటి యువత పెడ ధోరణిని అవలంభిస్తూ, పాచ్యాత్య సంస్కృతిని అనుకరిస్తూ, మధ్యానికి బానిసలై, మత్తుకు అలవాటు పడి భారతీయ సంస్కృతి-సాంప్రదాయ మూలాలను మరిచి నేడు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.

నేటి యువత భారతీయ సంస్కృతి సాంప్రదాయ మూలాలను ఎరిగి, భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం ఈ వ్యవసాయానికి మూలం గో సంపద కావున గోవును ప్రేమించడం, గో సేవ చేసుకోవడం, వందే గోమాతరం అంటూ నినదీస్తూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటించినప్పుడే, భారత దేశంలో భారతీయ సంస్కృతి నిలబడి నిలదొక్కుకుంటుందన్నారు. లేనట్లయితే రాబోయే కాలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు చరిత్ర పుటలోనే మిగిలిపోతుందని, కావున నేటి యువత భవిష్యత్తు తరాలకోసం భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకొని పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్, బీజేపీ సీనియర్ నాయకులు మీసాల రాజేశ్వర్, కృష్ణ గౌడ్, దళిత మోర్చ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పులి యుగంధర్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, ఉపాధ్యక్షులు సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story