- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వేయిలిస్తే.. బెయిలిస్తా లేదంటే కేసు కడతా..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి జిల్లాలో ఫ్రెండ్లీ పోలీస్ కాస్త బిజినెస్ పోలీస్ అయ్యింది. కేసు చిన్నదా? పెద్దదా? అనే తేడా లేకుండా ఏ కేసులో ఎంత నొక్కేసే అవకాశముందనే అంశంపైనే పోలీసులు దృష్టి పెడుతున్నారు. ఇద్దరు కొట్టుకుని స్టేషన్ కు వచ్చిన, రక్తాలు కారేలా తన్నుకుని వచ్చినా, ఇంకే రకమైన కేసులో స్టేషన్ కు వచ్చినా ఆ కేసులో తనకెంత లాభం కలుగుతుందనే ఆలోచనతోనే పోలీసులు పనిచేస్తున్నారనే విమర్శలను పోలీస్ వ్యవస్థ మూట కట్టుకుంటోంది. కేసులు,కోర్టులు, జైలు వంటి భయాలు చెబుతూ నిందితులను భయాందోళనకు గురి చేస్తున్నారు.
కేసు లేకుండా ఏదోలా ఇక్కడే సెటిల్ చేయండి మీకు పుణ్యముంటదని పోలీసులను నిందితులు వేడుకునేలా చేసి మరీ వేలకు వేలు దండుకుంటున్నారు. నేరస్తుల పాలిట సింహ స్వప్నంలా ఉండి, అమాయకుల పాలిట ఆత్మ బంధువులా ఉండాల్సిన పోలీసులు అందరినీ ఒకే గాటన కట్టేస్తున్నారు. ఇరు వైపుల నుండి కేసుల పేరు చెప్పి భారీగా నొక్కేస్తున్నారు. ఈ పద్ధతిలో పని చేస్తున్న ఉమ్మడి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల ఎస్ హెచ్ ఓ లు ఫ్రెండ్లీ పోలీస్ ను వదిలేసి బిజినెస్ పోలీస్ లుగా వ్యవహరిస్తున్నారు. స్టేషన్ లో పెండింగ్ కేసులెన్ని ఉన్న వారికి లెక్కలేదు. డబ్బులు రాని కేసుల పట్ల ఆసక్తి కూడా ఉండదు. డబ్బులొచ్చే కేసులో నిందితుడి నేర తీవ్రత ఎంత ఉన్నా ఫర్వాలేదు.దానికి తగ్గట్టు సొమ్ము దండుకుని కేసును నీరు గార్చేస్తారు. కఠిన సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన కేసులను కూడా పెట్టి కేసులతో సరిపెడుతున్నారు.
ప్రతి నెలా మామూళ్లు సరేసరి.. కొసరుగా స్టేషన్ బెయిల్
పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక రీచ్ ల నుంచి, బెల్టు షాపులు, డాబాలు, సిట్టింగ్ పాయింట్లు, మొరం దందాలు, జీరో ఫైనాన్స్ వంటి పలు మార్గాల ద్వారా ప్రతినెలా ఠంచనుగా అందే భారీ ముడుపులు కాకుండా అప్పటి కప్పుడు ఏరోజుకారోజు అంతే ముడుపుల కోసం కొందరు ఎస్ హెచ్ ఓలు ఆరాటపడుతున్నారు. ప్రతి రోజూ కొంత మొత్తంలో టార్గెట్ పెట్టుకుని మరీ ఎస్ హెచ్ ఓ లు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దండుకుంటున్నారు.
సెటిల్మెంట్లు, నెలవారీ మామూళ్లు, ఇతరత్రా క్రైమ్ కేసుల్లో ఎలాగూ వేలాది రూపాయలు అప్పనంగా నొక్కేస్తున్న పోలీసులు స్టేషన్ బెయిల్ ను కూడా వదలడం లేదు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో నూతన చట్టంలోని ప్రత్యేక సెక్షన్ ప్రకారం నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టకుండానే బెయిల్ మంజూరు చేసే అధికారం ఎస్ హెచ్ ఓ లకు ఉంది. ఈ అధికారాన్ని కూడా ఎస్ ఐ లు ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ప్రతి నెలా ఎస్ఐ లకు అందే ముడుపులు క్రమం తప్పకుండా అందుతున్నప్పటికీ స్టేషన్ బెయిల్ పై కూడా భారీగా సంపాదించాలనే టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. ఇందుకోసం స్టేషన్ కు వచ్చిన నిందితులను వ్యూహాత్మకంగా కేసులు, అరెస్టుల పేరుతో భయపెట్టి ఎలాగోలా ఎస్ఐ లు స్టేషన్ బెయిల్ కోసం ప్రాధేయ పడేటట్లు చేస్తున్నారు.
స్టేషన్ బెయిల్ కావాలంటే తాము అడిగినంత ఇచ్చుకోవాల్సిందేనని కరాఖండిగా డిమాండ్ చేస్తున్నారు. ఎస్ హెచ్ ఓ అడిగినంత ఇస్తే సరి..లేదంటే కేసు కట్టి జైలుకు పంపుతామంటూ కానిస్టేబుళ్ల ద్వారా బెదిరిస్తున్నారు. ఎస్ హెచ్ ఓ లకు నమ్మకంగా ఉన్న కానిస్టేబుళ్లతోనే వ్యవహారం నడిపిస్తూ స్టేషన్ బెయిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారు. కేసులో ఎఫ్ ఐ ఆర్ రాసి రిమాండ్ కు పంపితే ఏం జరుగుతుందో, ఎన్ని ఇబ్బందులెదురవుతాయో కానిస్టేబుళ్లు కళ్లకు కట్టినట్లు సినిమా చూపించి బెదిరిస్తారు. దీంతో జైల్ లో చిప్పకూడు తినే బాధ, బెయిల్ కోసం లాయర్ ఫీజులు, కోర్టు చక్కర్లతో ఇబ్బందులు పడే కన్నా స్టేషన్ బెయిల్ తో సెటిల్ చేసుకోవడమే మేలనే నిర్ణయానికి వచ్చి అడిగినంత ముట్టజెపుతున్నారు. నిందితుల ఆర్థిక స్థోమతను, కేసును బట్టి ఎస్ హెచ్ ఓలు డిమాండ్ చేస్తున్నారని కానిస్టేబుళ్లే చెప్పుకుంటున్నారు.
స్టేషన్ బెయిల్ కేసులోనే ఏసీబీ ట్రాప్ లో ఇద్దరు ఎస్ఐ లు
కామారెడ్డి జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎస్ ఐ లు స్టేషన్ బెయిల్ కేసులో నిందితుల నుంచి ముడుపులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈనెల 8 న వర్ని ఎస్ ఐ కృష్ణకుమార్ ఓ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.40 వేలు డిమాండ్ చేశాడు.నిందితుడు ఎస్ ఐ తో బేరమాడి రూ. 20 వేలకు ఒప్పందం కుదుర్చుకుని ఎస్ ఐ కి డబ్బులిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాజాగా గురువారం స్టేషన్ బెయిల్ కేసులోనే ఓ నిందితుడి నుండి రూ.10 వేలు తీసుకుంటూ లింగంపేట్ ఎస్ ఐ పబ్బాఅరుణ్ , స్టేషన్ రైటర్ కానిస్టేబుల్ తోట రామస్వామిలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వారం రోజుల్లోనే కామారెడ్డి జిల్లాలో ఇద్దరు ఎస్ ఐలు, ఓ కానిస్టేబుల్ స్టేషన్ బెయిల్ కేసులో ముడుపులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది.