జీఎస్టీ లేని బంగారం పేరిట మోసం..

by Sumithra |
జీఎస్టీ లేని బంగారం పేరిట మోసం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో దుబాయ్ నుంచి అక్రమమార్గంలో తీసుకువచ్చిన బంగారం ఉందని తక్కువ ధరకు (జీఎస్టీ) లేకుండా ఇస్తానని చాలా మంది నుంచి కోట్ల రూపాయలు వసూల్ చేసి మోసం చేసిన ఓ మోసగాడి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. సినిమా ట్విస్టులను మరిపించేలా జరిగిన ఉదంతంలో ఇప్పుడు బాధితులపైనే పోలీస్ స్టేషన్ లలో కేసులునమోదయ్యాయి. తనను డబ్బుల కోసం కిడ్నాప్ చేశారని, డబ్బులను, భూములను రాయించుకున్నారని మరికొందరిపై కేసులు నమోదవుతుండడంతో ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చింది. అసలు ట్విస్టు ఏంటంటే బంగారం కోసం డబ్బులు ఇచ్చిన అతని బంధువులు నిజామాబాద్ లో తప్పించుకు తిరుగుతున్నాడని నిర్మల్ లో అతని భార్యను మోసగాడిని తీసుకువచ్చి కామారెడ్డి జిల్లా జుక్కల్ లో రైసుమిల్లులో బంధించగా వారిపై కిడ్నాప్ కేసు నమోదయింది.

కేసు నమోదయిన తర్వాత డబ్బులు ఇచ్చిన వారు వేదిస్తుండడంతో ఏకంగా టక్కరి కోర్టును ఆశ్రయించి రిలీఫ్ పొందాడు. ఇప్పుడు ఎదురు తిరిగి డబ్బులు ఎవరైతే ఇచ్చారో వారిపైనే ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదవుతున్నాయి. నిజామాబాద్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి ప్రక్కన పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా దుబాయ్ కి వెళ్లి వస్తున్నాడు. 2008 నుంచి అక్కడ బంగారం తీసుకువచ్చి ఇక్కడ తక్కువ ధరకు ఇస్తానని నమ్మబలికాడు. అనుకున్న ప్రకారమే కొందరికీ బంగారాన్ని ఇచ్చాడు. ఇందులో ట్విస్టు ఏంటంటే అతడు స్థానికంగానే బంగారం కొనుగోలు చేసి అందులో కొందరికీ ఇచ్చినట్లు తెలిసింది.

దానికి తోడు కోటి రూపాయలకు ఆరు లక్షలు, అరకోటికి మూడు లక్షలు, 25 లక్షలకు లక్షన్నర వడ్డి చెల్లించడంతో చాలా మంది అతనికి డబ్బులు ఇచ్చారు. అలా కోట్ల రూపాయలు వసూల్ చేసిన మోసగాడు డిచ్ పల్లి, నవీపేట్, భైంసా, నిర్మల్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం. చివరి సారిగా 2019లో వచ్చినప్పుడు పెద్ద ఎత్తున బంగారం తెచ్చానని చాలా మందిని నమ్మించాడు. అతని నమ్మి పోలీసు రికార్డుల ప్రకారం 29 మంది నుంచి అధికారికంగా రూ.8 కోట్ల 75 లక్షలు వసూల్ చేసినట్లు చెబుతున్నాడు. ఎందుకంటే చాలా మంది అతనికి ఇచ్చిన డబ్బు బంగారం కోసం ఇచ్చి వడ్డీల రూపంలో వసూల్ చేసుకోవడంతో చెప్పుకునేందుకు ముందుకు రాకపోవడమే వాస్తవంగా అతను సుమారు రూ.40 కోట్లు వసూల్ చేసినట్లు బాధితులు చెబుతున్నారు.

దుబాయ్ బంగారం పేరిట మోసగాడి మాటలు నమ్మి ఓ ఎంపీపీ రూ.5 కోట్లు, మరో గ్రామానికి చెందిన వ్యక్తి రూ. రెండున్నర కోట్లు, ఓ వ్యాపారి రూ.2 కోట్లు, ఒక స్కూల్ నిర్వాహకుడు రూ.2 కోట్లు, ఒక ప్రభుత్వ సర్వేయర్ రూ.50 లక్షలు, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బంగారు దుకాణాలు పెట్టిన పెట్టుబడి రూ.40 కోట్లు ఉంటుందని అంచనా. నిర్మల్ జిల్లాకు చెందిన కొందరు పెద్దమనుషుల అండతో అందరిపై శఠగోపం పెట్టాడు. దానితో డబ్బులు ఇచ్చిన అతని సొంత బంధువులే అతని వద్ద నుంచి డబ్బులు వసూల్ చేయాలని బంధించడంతో వారిపై ఏకంగా కిడ్నాప్ కేసుపెట్టి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా తనకెవ్వరు డబ్బులు నేరుగా ఇవ్వలేదని మధ్యవర్తులు ఇచ్చారని వారిని డబ్బులు ఇచ్చిన వారిపై ఉసిగొల్పాడు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ ప్రత్యేక పోలీసుల టీం సంబంధిత బాధ్యులను లిఫ్ట్ చేసినట్లు తెలిపింది.

ఈ వ్యవహరంలోనే ఒక్కొక్కరిపై ఐదు నుంచి పది కేసుల వరకు వివిధ పోలీస్ స్టేషన్ లలో నమోదయ్యాయి. డబ్బులు ఇచ్చిందే కాకుండా మోసగాడి ఎత్తుగడలకు బలయ్యామని బాధితులు వాపోతున్నారు. కొందరు తమకు మోసగాడు ఇచ్చిన ప్రామిసరి నోట్లు, భూములను క్రమబద్దీకరించుకునే పనిలోపడ్డారు. ఒక అధికారి అండతో మోసగాడు వ్యవహరం సాగుతుండడంతో బాధితులు ఈ విషయాన్ని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తాము పెట్టుబడిగా పెట్టిన డబ్బులు ఇప్పించాలని కోరినట్లు సమాచారం. ఇటీవల సదరు మోసగాడు అందరితో చర్చలు జరిపే కార్యక్రమానికి ముందుకు వచ్చి కోర్టు ద్వారా చెప్పినట్లు తక్కువ డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకునే పనిలో పడినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed