భయం భయంగా.. అటవీ సమీప గ్రామాల్లో చిరుతల సంచారం

by Aamani |
భయం భయంగా.. అటవీ సమీప గ్రామాల్లో చిరుతల సంచారం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దట్టమైన అడవుల్లో సంచరించే చిరుత పులులు అటవీ సమీప గ్రామాల్లోకి వస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొద్ది రోజులుగా చిరుతలు సంచరిస్తుండడంతో ప్రజలు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. చిరుతలు పశువులు, లేగ దూడలు, మేకల మందలపై దాడులు చేసి జీవాలను చంపుతున్నాయి. అటవీ సమీప వ్యవసాయ క్షేత్రాల్లోకి పొలం పనులకు వెళ్లాలంటేనే రైతులు, వ్యవసాయ కూలీలు జంకుతున్నారు.

ఇటీవల తరచూ కనిపిస్తున్నాయి..

ఎప్పుడో గాని కనపడని చిరుతపులులు ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లాలో తరచూ కనిపిస్తున్నాయి. మేకల మందలపై దాడులు చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం నందిపేట్ మండలం బజార్ కొత్తూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోని మాయాపూర్, సీహెచ్ కొండూరు గ్రామాల శివారులోని అటవీ ప్రాంతంలో ఓ చిరుత పులి మేకల మందపై దాడి చేసింది. దూరం నుంచి గమనించిన మేకల కాపరి గట్టిగా కేకలు వేస్తూ దూరం నుంచే చిరుత పులి వైపు రాళ్లు రువ్వడంతో భయపడి పారిపోయింది. వెళుతూ వెళుతూ ఓ మేకను నోట కరుచుకుని వెళ్లింది. తాజాగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మడుగు తండా పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం వెలుగులోకి వచ్చింది. శనివారం ఓ చిరుత పులి మేకల మందపై దాడి చేసి మేకను గాయపరిచింది. అంతకు ముందు నిజామాబాద్ జిల్లా గుత్ప అటవీప్రాంతం గుండా వెళ్లే జాతీయ రహదారిపై రాత్రి సమయంలో రోడ్డు దాతుతున్న ఓ చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. రహదారిపైనే లేవలేని స్థితిలో దాదాపు అరగంట వరకు ఉండిపోయింది. ఆ రోడ్డు వెంట జనాలు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం చిరుత రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోవడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.

పెరిగిన చిరుతల సంచారం...

కొద్ది నెలలుగా ఉమ్మడి జిల్లాలోని అటవీ సమీప గ్రామాల్లో చిరుతల సంచారం ఎక్కువ కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పశువుల కాపరులు, వ్యవసాయ దారులు, రైతు కూలీలు, ఉపాధి హామీ కూలీలు, అటవీ ఉత్పత్తుల సేకరణ పై ఆధారపడి పొట్టపోసుకునే వారు అడవిలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. కొద్ది రోజులుగా చిరుతల భయంతో అడవుల్లోకి వెళ్లడమే మానేశామని చెబుతున్నారు. రెండు నెలల క్రితం కూడా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్ పూర్ శివారులో చిరుత పులి తోపాటు దాని పిల్లలు కూడా వెంట నడుస్తూ స్థానికుల కంట పడ్డాయి. మల్లారం ‌‌అటవీ ప్రాంతంలోనూ చిరుతలు ఈ మధ్య తరచూ కనిపిస్తున్నాయని రైతులు, గ్రామస్తులు చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం గుండారం, మల్కాపూర్ శివారులో కూడా మేకల మందపై చిరుత పులులు దాడి చేసి దాదాపు ఏడెనిమిది మేకలను చంపేశాయని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇందల్వాయి రేంజ్ లోని డిచ్పల్లి రాంపూర్ పరిధిలో కూడా ఓ చిరుత లేగ దూడపై దాడి చేసి చంపింది. నిజామాబాద్ నగర శివారులోని నాగారం డంపింగ్ యార్డ్ సమీపంలో కూడా చిరుత పులి సంచారం కలకలం రేపింది. ధర్పల్లి, ఇందల్ వాయి ఫారెస్ట్ పరిధిలో ప్రధాన రహదారిపై చిరుత పులులు రాత్రి వేళల్లో ఎన్నో సార్లు ధర్పల్లి, ఇందల్ వాయి రూట్లో తిరిగే చుట్టు పక్కల గ్రామాలకు కనిపిస్తున్నాయి.

అడవుల నరికివేత, పోడు వ్యవసాయం తో చిరుతలకు రక్షణ కరువు..

అడవుల్లో ఉండాల్సిన చిరుతపులులు అడవులను వదిలేసి అటవీ సమీప గ్రామాల్లోకి చొరబడటం ఇటీవలి కాలంలో ఎక్కువైందన్న విషయం తెలిసిందే. ధనార్జనే ధ్యేయంగా కలప స్మగ్లర్లు, పోడు వ్యవసాయం కోసం అటవీ ప్రాంత గిరిజనులు అడవులను యథేచ్ఛగా నరికేస్తుండటంతో అడవులు పలుచబడి పోతున్నాయి. దీంతో చిరుత పులులకు రక్షణ కరువవడమే కాకుండా వాటికి ఆహారంగా ఉపయోగపడే చిన్నపాటి జీవరాశులు లభించకపోవడంతో చిరుత పులులు అటవీ సమీప గ్రామాల్లోని పశువులపైనా, మేకల మందల పైనా దాడులు చేస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చిరుత పులులు ఎప్పుడూ ఒకే చోట ఉండవని, ఒక చోట కనిపించిన చిరుతలు ఆహారం కోసం కిలోమీటర్ల దూరానికి వెళతాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. చిరుతలు కనిపించిన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

చిరుత పులుల సంచారం సమాచారమివ్వాలి : నందిపేట్ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్

చిరుత పులుల సంచారంపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇస్తే బంధించే ప్రయత్నం చేస్తాం. కరెంట్ కనెక్షన్ తో కూడిన ఇనుప తీగల కంచెను ఏర్పాటు చేసి చిరుతల చావుకు కారణమైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 యాక్టు ప్రకారం చిరుతలను చంపిన వారికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. చిరుత పులులను చంపరాదు.

జిల్లాలో వందకు పైగా చిరుతలు : ఇందల్వాయి డిప్యూటీ రేంజ్ అధికారి రవి మోహన్ భట్

ఉమ్మడి జిల్లాలో వందకు పైగా చిరుత పులులు ఉన్నాయి. ఫారెస్ట్ కు ఆనుకుని ఉన్న గ్రామాలు, ప్రాంతాల్లో అప్పుడప్పుడు చిరుతలు కనిపించడం సహజమే. ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. అడవుల్లో ఉండాల్సిన చిరుతపులులు అడవిని దాటి అటవీ సమీప గ్రామాల్లోకి ఎందుకు వస్తున్నాయనే దానిపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Next Story

Most Viewed