రైతుల ఆత్మహత్యలు ఆగాలి

by Sridhar Babu |
రైతుల ఆత్మహత్యలు ఆగాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దేశానికి రైతులే వెన్నముక అని, వారి ఆత్మహత్యలు అగాలి అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగింపు సభకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో దేశంలోని అనేక గ్రామాలు అధ్వానంగా తయారయ్యాయి అన్నారు. రోడ్లు, తాగు నీటి సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడ్డారు అని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు ఆసుపత్రులు అందుబాటులో లేక అనేక గ్రామాలు ఖాళీ అయ్యాయని, అనాటి దుస్థితి మళ్లీ రావద్ధని అన్నారు. దేశంలో అన్ని గ్రామాలలో రోడ్ల నిర్మాణాల కోసం ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. దాంతో దేశంలోని అన్ని గ్రామాలకు పట్టణాలతో లింక్​ కలిసిందని చెప్పారు.

రైతులు పండించే పంటలతో దేశం సుభిక్షంగా ఉందని, కానీ రైతుల ఆత్మహత్యలు జరగడం బాధాకరం అన్నారు. రైతులకు ఆర్థిక చేయూతనిచ్చి వారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆగాలని, విమానాలకు ఇంధనం అందించే సత్తా మన రైతుల్లో ఉందని తెలిపారు. దేశంలో 2 లక్షల కోట్లతో ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణాలు చేపట్టాం అన్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడినప్పుడే వ్యాపార,వాణిజ్య రంగాలు, టూరిజం అభివృద్ది చెందుతోందని అన్నారు. దేశ ముఖ చిత్రాన్ని మార్చే సత్తా బీజేపీ తోనే సాధ్యం అన్నారు.

రాబోయే కాలంలో తెలంగాణలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప ప్రజా సంక్షేమం కనిపించడం లేదు అని తెలిపారు. మూడవసారి మోడీ ప్రధానిగా ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. నిజామాబాద్ పార్లమెంట్ లో జరిగిన అభివృద్ధి పరిగణలోకి తీసుకుని బీజేపీని గెలిపించాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా మీదుగా 63వ జాతీయ రహదారికి గ్రీన్ కారిడార్ కు నిధులు ఇచ్చిన విషయాన్ని కేంద్రమంత్రి గుర్తు చేశారు.

పసుపు బోర్డు కల ప్రధాని మోడీ ద్వారా నెరవేరింది : ఎంపీ అర్వింద్

ఉత్తర తెలంగాణలో అత్యధికంగా పసుపు పండిస్తూ జిల్లా స్థితిగతులను మారుస్తున్న పసుపు రైతుల మూడు దశాబ్ధాల పసుపు బోర్డు కలను ప్రధాని నరేంద్ర మోడీ ద్వారా నెరవేరిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. 15 ఏళ్లుగా పడిపోయిన పసుపు ధర ఇప్పుడు పరుగులు పెడుతోంది అన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో పసుపు ధర రూ.14 వేలు దాటింది అన్నారు.

బోధన్ షుగర్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ బీఆర్ఎస్ లు నిర్వీర్యం చేశాయి అన్నారు. ఈ రెండు పార్టీ లు చెరకు రైతులను మోసం చేశాయి అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో రైతులను మోసం చేసేందుకు ఎన్నికల కోసం మళ్లీ కాంగ్రెస్ కమిటీ వేసింది అని ఎంపీపి అరవింద్ ఆరోపించారు. మరోసారి మోడీ ప్రధాని కానున్నారని, బీజేపీ గెలవడం ద్వారా జిల్లా రూపు రేఖలు మారుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యానారాయణ, పైడి రాకేష్ రెడ్డి, నాయకులు పల్లె గంగారెడ్డి, యెండల లక్ష్మి నారాయణ, స్రవంతి రెడ్డిలతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story