నకిలీ డెత్ సర్టిఫికెట్ల కథ కంచికేనా...?

by Aamani |
నకిలీ డెత్ సర్టిఫికెట్ల కథ కంచికేనా...?
X

దిశ, వైరా : వైరాలో గత వారం రోజుల క్రితం కలకలం సృష్టించిన నకిలీ డెత్ సర్టిఫికెట్ల బాగోతం కథ కంచికి చేరిందనే విమర్శలు వినవస్తున్నాయి. నకిలీ డెత్ సర్టిఫికెట్లను సృష్టించిన వారిపై కనీస చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ‘దిశ' దినపత్రిక నకిలీ డెత్ సర్టిఫికెట్ల బాగోతాన్ని వార్త కథన రూపంలో బహిర్గతం చేయటంతో నిఘా వ్యవస్థలు హడావుడిగా విచారణ చేశాయి. అయితే ఆ తర్వాత ఈ వ్యవహారంపై ఆ వ్యవస్థలు పూర్తిస్థాయిలో విచారణ చేయటం మరిచాయి . దీంతో ఈ విచారణ ఆరంభ శూరత్వమేనా అనే ఆరోపణ వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం బహిర్గతమై వారం రోజులు గడిచినప్పటికీ సూత్రధారులు పాత్రధారులు పై కనీస చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శలు వినవస్తున్నాయి.

పల్లిపాడు గ్రామానికి చెందిన గంధం నగేష్ తల్లిదండ్రులు గంధం గోపయ్య, గంధం మరియమ్మ లకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పేరుతో ఇద్దరు దళారులు నకిలీ డెత్ సర్టిఫికెట్లను సృష్టించారు. ఈ డెత్ సర్టిఫికెట్ల ఆధారంగా గంధం గోపయ్య పేరుతో ఉన్న ఇంటిని అతని కుమారుడు గంధం నగేష్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విషయాన్ని ఈనెల 2వ తేదీన దిశ వెబ్సైట్లో, 3వ తేదీన దిశ దినపత్రికలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం అనే వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో 3వ తేదీన వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కాపీలను నిఘా వ్యవస్థల అధికారులు సేకరించారు. అనంతరం ఇంటి రిజిస్ట్రేషన్ చేయించుకున్న గంధం నగేష్ ను నిఘా వ్యవస్థల అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు . ఆ తరువాత 4వ తేదీన ఖమ్మంలోని ఓ నిఘా వ్యవస్థ కార్యాలయంలో వైరాకు చెందిన డాక్యుమెంట్ రైటర్ రామిశెట్టి కిరణ్, దళారులు యాలాద్రి, వెంకన్న లను విచారించారు. మరలా అప్పటినుంచి ఇప్పటివరకు ఈ విషయాన్ని అధికారులు మరిచారు.

సూత్రధారులు పాత్రధారులపై చర్యలు శూన్యం...

గంధం నగేష్ కు ఇంటి రుణం ఇప్పించేందుకు అతని పేరుతో వైరా మండలానికి చెందిన ఇద్దరు దళారులు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ రిజిస్ట్రేషన్ కోసం సదరు దళారులు ఖమ్మంలోని ఓ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ద్వారా నకిలీ డెత్ సర్టిఫికెట్లను సృష్టించారు. ఈ సర్టిఫికెట్లను సృష్టించి సబ్ రిజిస్టర్ వ్యవస్థనే వారు మోసం చేశారు. అంతేకాకుండా డాక్యుమెంట్ రైటర్ రామిశెట్టి కిరణ్ ఈ రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే హక్కు విడుదల దస్తావేజు రిజిస్ట్రేషన్ కు బదులు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా సబ్ రిజిస్టర్ ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్లు చూడకుండా, కనిపించి కనిపించని జిరాక్స్ డెత్ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్ చేయడం పలు అనుమానాలు దారితీస్తోంది. నకిలీ డెత్ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై కూడా కనీస చర్యలు తీసుకోవడంలో ఆ శాఖలోని ఉన్నతాధికారులు విఫలమయ్యారు.

ఈ డెత్ సర్టిఫికెట్ల సూత్రధారి ఖమ్మంలోని ఓ ఫైనాన్స్ సంస్థలో పనిచేసే ఉద్యోగని, పాత్రధారులు వైరా మండలంలోని ఇంటి రుణాలు ఇప్పించే ఇద్దరు దళారులని ఓ నిఘా సంస్థ విచారణలో తెలిసింది. అంతేకాకుండా డాక్యుమెంట్ రైటర్ కూడా ఈ నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించటంలో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే ప్రభుత్వ వ్యవస్థనే మోసం చేస్తూ నకిలీ డెత్ సర్టిఫికెట్లు తయారు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారాన్ని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో మరిన్ని నకిలీ బాగోతాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనేక నకిలీ సర్టిఫికెట్లతో కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంలో పాత్రధారులు సూత్రధారులు పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed