అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి

by Naveena |
అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి
X

దిశ,కొల్లాపూర్: కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నల్లమల అడవుల్లో ఓ చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కొల్లాపూర్ నల్లమల అడవుల్లోని అమరిగిరి గ్రామానికి వెళ్లే రోడ్డుకు సమీపంలో చిన్న గండి అటవీ ప్రాంతంలో ఓ చెట్టు కింద చిరుత పులి విగతజీవై పడి ఉన్నది. చిరుత కళేబరం కుళ్లి పురుగులతో కూడి, దుర్వాసన రావడంతో..చూస్తే మూడు నాలుగు రోజుల క్రితం చనిపోయినట్టు అటవీ అధికారులు ప్రాథమిక అంచనకు వచ్చారు. అయితే ఈ చిరుత అనుమానాస్పద స్థితిలో మరణించడంతో వేటగాళ్లు ఏమైనా.. విష ప్రయోగం చేసి చంపి ఉంటారా? లేదా వేటగాళ్లు ఉచ్చు వేసి హతమార్చారా ? లేదా వయోభారంతో సహజ మరణమా? అనే కోణాల్లో అటవీశాఖ అధికారులు క్షుణంగా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే జిల్లా అటవిశాఖ అధికారి రోహిత్ గోపిడి, చిరుత పులి చనిపోయిన ప్రాంతాన్ని బుధవారం సాయంత్రం సందర్శించి , చనిపోయిన తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. సంఘటన స్థలంలోనే చనిపోయిన చిరుతకు కొల్లాపూర్ నుంచి వెటర్నరీ డాక్టర్ ను రప్పించి పోస్టుమార్టం చేయించినట్లు అటవీ శాఖ వర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఈ గత రెండు మూడేళ్లుగా నల్లమల అడవుల్లో వన్యప్రాణుల సంతతి భారీగా పెరిగిందనీ చెప్పకతప్పదు. సంఘటన స్థలానికి డిఎఫ్ఓ తో పాటు కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్, ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed