Breaking News : పాఠశాలల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు : సీఎస్ శాంతికుమారి

by M.Rajitha |
Breaking News : పాఠశాలల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు : సీఎస్ శాంతికుమారి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు(Food Safety Committees) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS ShanthiKumari) ఉత్తర్వులు జారీ చేశారు. ఆహారభద్రతపై ముగ్గురు సభ్యులతో కూడిన టాస్క్‌ఫోర్సు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, విద్యాసంస్థ అధికారి, జిల్లాస్థాయి అధికారులు ఆ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారని తెలిపారు. కాగా నేడు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సిద్ధిపేటలోని గురుకుల పాఠశాలలను తనిఖీ చేసి.. ఆహార పదార్థాలను, కనీస వసతులను పరిశీలించారు. హాస్టళ్ల పర్యవేక్షణపై ప్రభుత్వం కమిటీలను నియమిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి ఏ కారణం వల్లనైనా అస్వస్థతకు గురైనా ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు.

ఇటీవల పలు గురుకుల, సంక్షేమ హాస్టళ్లలో, పాఠశాల మధ్యాహ్న భోజనాల్లో ఫుడ్ పాయిజన్ జరిగి వందలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై హైకోర్ట్(High Court) రాష్ట్ర ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నాణ్యత పాటించాలని ఎన్నిసార్లు సూచించినా.. నాణ్యత లేని ఆహారం అందించడంపై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల్ని కన్నబిడ్డల్లా చూసుకోవాలని, పౌష్టిక ఆహారం అందించే విషయం అలసత్వానికి, ఆలస్యానికి తావు ఇవ్వొద్దని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తరచూ పాఠశాలలు, గురుకులాలను తనిఖీ చేయాలని తెలిపారు. అలాగే.. మాగనూర్ ఘటనలో బాధ్యులైన వారిపై వేటు వేసి, సంబంధిత నివేదికలను సమర్పించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story