K4 nuclear: k4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష సక్సెస్.. ఐఎన్ఎస్ అరిఘాట్ నుంచి ప్రయోగం

by vinod kumar |
K4 nuclear: k4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష సక్సెస్.. ఐఎన్ఎస్ అరిఘాట్ నుంచి ప్రయోగం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత నావికాదళం K4 బాలిస్టిక్ క్షిపణిని (k4 Balistic missile) విజయవంతంగా పరీక్షించింది. 3500 కిలోమీటర్ల పరిధి గల ఈ మిస్సైల్‌ను ఇటీవలే నౌకాదళంలో చేరిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాట్ (INS arighat) నుంచి గురువారం ప్రయోగించారు. క్షిపణి అన్ని లక్ష్యాలను ఛేదించిందని పరీక్ష ఫలితాలను పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నామని రక్షణ వర్గాలు తెలిపాయి. దీని తర్వాత క్షిపణి పనితీరుపై మిలిటరీ, రాజకీయ నాయకత్వానికి సమాచారం అందించనున్నారు. భారత్ అణుత్రయాన్ని బలోపేతం చేయడానికి ఈ పరీక్ష చాలా ముఖ్యమైందని అధికారులు భావిస్తు్న్నారు. దేశంపై అణు దాడి జరిగినప్పుడు తిరిగి ప్రతిస్పందించడానికి ఈ ట్రయల్ ఎంతో కీలకంగా ఉపయోగపడనుంది. ముఖ్యంగా నీటి అడుగున ప్రయోగించడానికి k4 క్షిపణిని రూపొందించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఇంతకుముందు క్షిపణిని పూర్తి స్థాయి పరీక్ష కోసం సిద్ధం చేయడానికి విస్తృతమైన ట్రయల్స్ నిర్వహించింది.

k15 క్షిపణుల కంటే ఎక్కువ

K4 లేదా కలామ్4 అనేది అణు సామర్థ్యం గల ఇంటర్మీడియట్-రేంజ్ సబ్‌మెరైన్-లాంచ్ బాలిస్టిక్ క్షిపణి. ఐఎన్ఎస్ అరిఘాట్‌లో ఈ క్షిపణి అమర్చబడి ఉంటుంది. ఇది 3500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలపై దాడి చేయగలదు. దీని బరువు17 టన్నులు ఉండగా, క్షిపణి పొడవు 39 అడుగులు, వెడల్పు 4.3 మీటర్లు ఉంటుంది. ఈ క్షిపణి 2500 కిలోల వరకు అణు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. అయితే భారతదేశపు మొట్టమొదటి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్‌(INS Arihanth)లో K15 క్షిపణులు ఉన్నాయి. కానీ వాటి పరిధి కేవలం 750 కిలోమీటర్లు మాత్రమే కావడం గమనార్హం. ఐఎన్ఎస్ అరిఘాట్ నుంచి K4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం ఇదే తొలిసారి. తాజా పరీక్ష దేశ రక్షణలో ఓ మైలురాయిగా నిలుస్తుందని అధికారులు భావిస్తు్న్నారు.

ఆసియాలో రెండో దేశం

k4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం తర్వాత జలాంతర్గామి నుంచి అణుదాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఆసియాలో రెండో దేశంగా భారత్ అవతరించింది. అంతకుముందు కేవలం చైనాకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది. దీంతో భారత్ అణుశక్తి మరింత బలపడనుంది. కాగా, వచ్చే ఏడాది మరో అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ ఆరిడ్‌మాన్ (INS Aridman) కూడా భారత నౌకాదళంలోకి చేరనుంది. ఐఎన్ఎస్ ఆరిడ్‌మాన్‌లో K4, K5 బాలిస్టిక్ క్షిపణులను అమర్చారు. K5 క్షిపణి పరిధి 5000 కిలోమీటర్ల వరకు ఉండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed