మంత్రి ఇలాకాలో రైతుల గోడు పట్టించుకోని యంత్రాంగం..

by Sumithra |
మంత్రి ఇలాకాలో రైతుల గోడు పట్టించుకోని యంత్రాంగం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వారంతా ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులు. తాము పండించిన ధాన్యంను ప్యాడి బ్రోకర్ కు అప్పచెప్పి అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. ఏడాది క్రితం మంత్రి ఇలాకాకు చెందిన మూడు గ్రామాల 200 మంది రైతులు కోటి రూపాయల విలువైన ధాన్యాన్ని వడ్ల వ్యాపారికి ఇచ్చి పైసల కోసం నానా తంటాలు పడుతున్నారు. ధాన్యం తాలూకు డబ్బులు రాకపోయేసరికి వ్యాపారి ఇంటి వద్దనే మూడు రోజులుగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మూడు గ్రామాల నుంచి 15 మంది రైతులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వడ్ల వ్యాపారి ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న పట్టించుకునే నాధుడే కరువైయ్యాడు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్ గల్ మండలంలోని కుపకల్, జగిర్యాల్, దర్పల్లి మండలం బిబి తండా కు చెందిన సుమారు 200 మంది రైతులు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన గంప భద్రయ్య అండ్ కంపెనీ కి చెందిన గంప శ్రీనివాస్ కు కోటి రూపాయల విలువైన ధాన్యాన్ని అప్పగించారు. 2021లో ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోయినా మంచి ధర వస్తుందని నమ్మించి వడ్ల వ్యాపారి రైతుల వద్ద ధాన్యాన్ని తీసుకున్నారు. ధాన్యం తాలూకు డబ్బుల కోసం తిరిగి తిరిగి వేసారిపోయారు. రైతులకు వ్యాపారి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఈ విషయంలో మంత్రి ఆదేశించిన రైతులకు వ్యాపారి న్యాయం చేయలేకపోయాడు.

ఈ నెల 15న వ్యాపారి గడువు ఇచ్చి మోసం చేయడంతో రైతులు డబ్బులు వసూల్ అయ్యే వరకు కదిలేది లేదని భీష్మించుక కూర్చున్నారు. రైతులకు రావాల్సిన డబ్బుల కోసం మూడు గ్రామాల రైతులు వంతుల వారిగా నిరసనకు పిలుపునిచ్చారు రోజుకు ఐదుగురు చొప్పున మూడు గ్రామాల రైతులు గత మూడు రోజులుగా వడ్ల వ్యాపారి గంప శ్రీనివాస్ ఇంటి ఎదుట నిరసన చేస్తున్నారు పోలీసులు వచ్చి వ్యాపారి తో చర్చలు జరిపిన అవి ఫలప్రదం కాలేదు. వ్యాపారి మొత్తం డబ్బులు ఇస్తేనే కదులుతామని అప్పటివరకు ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తి లేదని రైతులు తేల్చి చెప్పారు. మంత్రి నియోజక వర్గం సంబంధించిన 200 మంది రైతులు వడ్ల వ్యాపారం నుంచి డబ్బుల కోసం నిరసన చేస్తున్న పట్టించుకునే వారి లేరు.

లైసెన్స్ కలిగిన వ్యాపారి రైతులను డబ్బుల కోసం ఏ డాదిగా తిప్పుతున్న మార్కెటింగ్ అధికారులు కానీ, జిల్లా పాలన అధికారులు కానీ, పోలీసులు గాని న్యాయం చేయలేకపోతున్నారు. ఎండనక, వాననక కనుకరించేవారు కరువయ్యారు. పగలు నిరసన చేస్తూ రాత్రివేళ గంజిలో దుకాణాల వద్ద నిద్రిస్తున్నామని తమ గోడును పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. సొసైటీలకు కొనుగోలు కేంద్రాలకు దాన్యం ఇవ్వకపోవడమే రైతులు మూల్యం చెల్లింపుకు కారణమని వాదనలు ఉన్నాయి. మరో వారం రోజుల్లో డబ్బులు ఇస్తామని వ్యాపారి హామీ ఇచ్చిన తీసుకునే వరకు కదలమని అక్కడే తిష్ట వేసి కూర్చున్నారు.

Advertisement

Next Story