- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Collector : సిరికొండలో కలెక్టర్ విస్తృత తనిఖీలు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మారుమూల ప్రాంతం సిరికొండ మండలంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పర్యటించారు. పలు చోట్ల విస్తృతంగా తనిఖీలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రజాపాలన సేవాకేంద్రం, గిరిజన ఆశ్రమ పాఠశాలలు తదితర వాటిని ఆకస్మికంగా సందర్శించి వాటి పనితీరును నిశితంగా పరిశీలన జరిపారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆశ్రమ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాలలను, వాల్గోట్ కలాన్ గ్రామంలోని జడ్పీ హైస్కూల్ లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను కూడా ఆయన పరిశీలించారు. తాగునీటి వసతి, కిచెన్ షెడ్, క్లాస్ రూమ్స్, వరండా తదితర వాటిని కలెక్టర్ పరిశీలించారు.
పనులు పూర్తయిన వాటికి తక్షణమే ఎం.బీ రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు. తుది దశలో ఉన్న పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, వేగవంతంగా పూర్తి చేయించాలన్నారు. విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్న కలెక్టర్, ఉపాధ్యాయుల హాజరు గురించి వాకబు చేశారు. తరగతి గదులను సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న బోధనా తీరును పరిశీలించారు. డిజిటల్ విధానంలో కొనసాగుతున్న విద్యా బోధనతో పాఠాలు సులభతరంగా ఆకళింపు చేసుకోగల్గుతున్నామని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా గణితం, సామాన్య శాస్త్రం పాఠ్యంశాలు సులభంగా అర్ధమయ్యేందుకు డిజిటల్ క్లాస్ రూమ్ ఉపకరిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పలువురు విద్యార్థులు నోట్ బుక్స్ చెక్ చేసి, వారికి అందిస్తున్న బోధన తీరును గమనించారు.
వార్షిక పరీక్షల్లో అందరూ 10 జీపీఏ సాధించాలని పదవ తరగతి విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాకుండా విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు అందించడం జరుగుతోందని గుర్తు చేశారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని, ఏకాగ్రతతో చక్కగా చదువుకుని తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి పేరు తేవాలని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. ఏవైనా సందేహాలు ఉంటే ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. గణితం సబ్జెక్టు పట్ల ఉన్న అనవసర భయాన్ని వీడాలన్నారు. నిజానికి ఇతర సబ్జెక్టుల కంటే గణితమే సులభతరమని కలెక్టర్ విద్యార్థులకు హితబోధ చేశారు. గణితంలో పట్టు సాధిస్తే, టెన్త్ తర్వాత ఇంటర్, డిగ్రీ వంటి వాటిలోనూ రాణించేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. విద్యలో రాణించాలంటే ఏం చేయాలనే అంశాల పై కలెక్టర్ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.
సిరికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కౌంటర్, అవుట్ పేషంట్, ఇన్-పేషంట్ విభాగాలు, వివిధ వార్డులను సందర్శించారు. మధుమేహం, రక్త పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు సగటున ఎంత మంది రోగులు వస్తారు. ఎంతమంది ఇన్ పేషంట్లుగా చేరుతున్నారు, మందులు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని వైద్యారోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.
వైద్యుల కొరత ఉన్న చోట కాంట్రాక్టు పద్ధతిన డాక్టర్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు, వసతి గృహాలను కనీసం వారానికి ఒకసారైనా వైద్యులు సందర్శించి విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికి సైతం ఆరోగ్య పరీక్షలు జరపాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న ప్రజాపాలన సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు సమకూర్చిన సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ సాయాగౌడ్, మండల ప్రత్యేక అధికారి నాగురావ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం, పంచాయతీరాజ్ ఈ ఈ శంకర్ నాయక్, ఎంపీడీవో లక్ష్మీప్రసాద్, తహసీల్దార్ రవీందర్రావు తదితరులు ఉన్నారు.