దళిత అబ్బాయిని కులాంతర వివాహం చేసుకున్నందుకు, అమ్మాయి కుటుంబాల వెలివేత

by Naresh |
దళిత అబ్బాయిని కులాంతర వివాహం చేసుకున్నందుకు, అమ్మాయి కుటుంబాల వెలివేత
X

దిశ, మాచారెడ్డి: సాంకేతిక రంగాల్లో దూసుకెళుతున్న మానవ మేధస్సు సామాజిక రుగ్మతలను దూరం చేయలేకపోతోంది. సాంకేతిక రంగాన్ని వాడుకుంటూనే చాందసవాదాన్ని వీడటం లేదు. దీంతో నాగరిక జీవితంపై అనాగరిక నియంతృత్వ పెత్తనం కొనసాగుతూనే ఉంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని ఐదు గౌడ కుటుంబాలు గత మూడేళ్లుగా వెలివేతకు గురైన ఘటనే ఇందుకు నిదర్శనం.

వివరాల్లోకి వెళితే.. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన బంగ్ల రాజేందర్ గౌడ్ కూతురు, దళిత అబ్బాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గౌడ కుల సంఘం పెద్దలు ఆ అమ్మాయికి చెందిన ఐదు కుటుంబాలను కులం నుంచి బహిష్కరించారు.

మూడు సంవత్సరాలుగా ఇది కొనసాగుతూనే ఉంది. ఎన్నో పర్యాయాలు బాధిత కుటుంబాలు తమను కులంలో కలుపుకోవాలని, అమ్మాయి చేసిన తప్పులకు తాము శిక్ష అనుభవించాలా అని గౌడ సంఘం ప్రతినిధులను వేడుకున్నప్పటికీ కనికరం చూపలేదు. దీంతో బాధిత కుటుంబాలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు రాజకీయ నాయకులతో గౌడ సంఘం కులపెద్దలు ఒత్తిళ్లు తేవడంతో.. వారు తమ ఫిర్యాదును చెత్తబుట్టకు పరిమితం చేశారు. తాము సంధించిన అస్త్రం పక్కదారి పడుతుందని భావించిన కులపెద్దలు ఎల్లమ్మ గుడి స్థలానికి కుల బహిష్కరణకు లింకు పెట్టి, కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ ఐదు కుటుంబాలతో గౌడ కులస్తులు ఎవరైనా మాట్లాడినా, మంచి చెడులకు పిలిచినా.. వారికి రూ.50వేల జరిమానా విధిస్తామని కుల సంఘ పెద్దలు తీర్మానించారు. ఇలాంటి వేధింపులను మరో నాలుగు కుటుంబాలు కూడా గౌడ సంఘంలో ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

అయితే.. ఆ కుటుంబాలు సమాజంలో పరువు పోతుందని తమ బాధను బయటకు చెప్పుకోలేక పోతున్నారు. 2021 నుండి ఇప్పటి వరకు ఆ కుటుంబాలు వేదనకు గురవుతూనే ఉన్నాయి. ఈ నెల 23న మరో మారు జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేశారు. తమకు గౌడ సంఘం పెద్దలతో ప్రాణహాని ఉందని, అధికార యంత్రాంగం తమ వేదనను పట్టించుకొని తమకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed