వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

by Sumithra |
వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
X

దిశ, ఆర్మూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామ శివారులో అధికారులు, నాయకులతో కలిసి గురువారం వనమహోత్సవం కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ భూ మండలంలోని సమస్త ప్రాణుల జీవన మనుగడకు చెట్లే ఆధారం అన్నారు. భవిష్యత్ తరాలకు ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే మనిషికి ఒక మొక్క నాటడంతో పాటు మొక్కలను సంరక్షిస్తూ పెంపకాల బాధ్యతలను తీసుకోవాలన్నారు. ప్రజల మనుగడకు చెట్లు ఉండాలి కాబట్టి ప్రభుత్వం రోడ్ల వెంబడి కానీ ఊర్లలో కానీ పండ్ల చెట్లు, వేప చెట్టు ఎక్కువగా పెంచేలా చూడాలన్నారు. మొక్కలు నాటే సందర్భంలో విద్యుత్ వైర్ల కింద నాటకుండా అధికారులు ఇతర స్థలాలను ఎంపిక చేసుకోవాలన్నారు.

రోడ్ల వెంబడి నాటే మొక్కల విషయంలో విద్యుత్ వైర్లకు ఇబ్బందులు కాకుండా చిన్నగా పెరిగే మొక్కలను విద్యుత్ వైర్లు ఉన్నచోట నాటుతూ లేనిచోట ఏపుగా మొక్కలను నాటాలన్నారు. మొక్కలు నాటి సమాజంలోని ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్క సంరక్షణ చూసుకోవాలన్నారు. అకారణంగా చెట్లు నరికితే జరిమానను ఆ వ్యక్తులకు తప్పక విధించాలన్నారు. అంతకు ముందు పిప్రి గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ఆ పాఠశాల హెచ్ఎం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎంపీడీవో సాయిరాం, బీజేపీ మండల అధ్యక్షుడు పిప్రి రోహిత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కేసి.ముత్తెన్న, బీజేపీ నాయకుడు సుంకరి భూషణ్, ఉపాధి హామీ ఏపీవో సురేష్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed