ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా అవగాహన కల్పించాలి

by Disha Web Desk 15 |
ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా అవగాహన కల్పించాలి
X

దిశ, కామారెడ్డి : ప్రజాస్వామ్య పటిష్టతకు ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటువేసేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మహిళా సమాఖ్య సంఘ సభ్యులకు సూచించారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం స్వీప్ ఆధ్వర్యంలో పట్టణ మహిళా సమాఖ్య సభ్యులతో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... జిల్లాలో సరాసరి 80 శాతం ఓటు నమోదు కాగా పట్టణ ప్రాంతాల్లో కేవలం 60 శాతం మాత్రమే నమోదవుతుందన్నారు. వంద శాతం ఓటింగ్ నమోదయితే ఫలితాలను ప్రభావితం చేస్తాయని, కాబట్టి పట్టణంలోని 1547 మహిళా సమాఖ్య సంఘాలు16 వేల మంది సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కలిగించి ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చైతన్యం తేవాలన్నారు. ఐదేండ్లకు

ఒకసారి వచ్చే ఎన్నికల్లో సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం ద్వారా దేశాభివృద్ధికి బాటలు వేసినవారవుతామని అన్నారు. ప్రతి అభ్యర్థి వివరాలను భారత ఎన్నికల సంఘం పారదర్శకంగా తమ వెబ్ సైట్ లో పొందుపరుస్తుందని, ఓటర్లు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. మే 13న హాలిడే కాదని, ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వం కల్పించే వెసులుబాటని, ఇది ప్రతి ఒక్కరూ గమనించి బద్దకం వీడి ఓటు వేయాలని కోరారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారని, కానీ మనం కేవలం ఓటు హక్కును వినియోగించుకొని వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా చూడాలన్నారు. అనంతరం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు వేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి వెంకటేష్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుజాత, పట్టణ మహిళా సమాఖ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



Next Story