ఇండియన్ సూపర్ లీగ్ చాంపియన్‌గా ముంబై సిటీ

by Dishanational3 |
ఇండియన్ సూపర్ లీగ్ చాంపియన్‌గా ముంబై సిటీ
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ 10వ సీజన్‌లో ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ మోహన్ బగాన్ సూపర్ జెయింట్‌కు షాకిచ్చి కప్పు ఎగరేసుకపోయింది. కోల్‌కతా వేదికగా శనివారం జరిగిన ఫైనల్‌లో మోహన్ బగాన్‌పై 1-3 తేడాతో విజయం సాధించింది. ఊహించినట్టే మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్లు చక్కటి డిఫెన్స్ ప్రదర్శించడంతో 40 నిమిషాల్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అప్పటి వరకూ ఇరు జట్ల గోల్ ప్రయత్నాలు ఫలించలేదు.

అయితే, ఈ మ్యాచ్‌లో తొలి గోల్ మోహన్ బగాన్‌దే. 44వ నిమిషంలో జాసన్ కమ్మింగ్స్ ఆ జట్టు ఖాతా తెరిచాడు. అదే చివరిది కూడా. ఫస్టాఫ్‌లో మోహన్ బగాన్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీ ఆటగాళ్లు పుంజుకున్న తీరు అద్భుతం. ముంబై తరపున 53వ నిమిషంలో జార్జ్ పెరేనా డియాజ్ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. తొలి గోల్ తర్వాత ముంబై ఆటగాళ్ల దూకుడు పెంచారు. పదే పదే ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడి చేశారు.

ఈ క్రమంలోనే 81వ నిమిషంలో జాకుబ్ వోజ్టస్ అందించిన బంతిని బిపిన్ సింగ్ విజయవంతంగా గోల్ చేయడంతో ముంబై 2-1తో ఆధిక్యంలోకి వెళ్లి పట్టు సాధించింది. ఆ తర్వాత అదనపు సమయంలో జాకుబ్ వోజ్టస్( 97వ నిమిషం) గోల్ చేయడంతో ముంబై ఆధిక్యం 3-1కి చేరింది. మరోవైపు, మోహన్ బగాన్ ఏకైక గోల్‌కే పరిమితమై టైటిల్‌ను కాపాడుకోవడంలో విఫలమైంది. ముంబై సిటీ ఎఫ్‌సీ ఐఎస్‌ఎల్ చాంపియన్‌గా నిలవడం ఇది రెండోసారి. 2020-21లో తొలిసారి టైటిల్ దక్కించుకుంది. అప్పుడ కూడా ఫైనల్‌లో మోహన్ బగాన్‌నే ఓడించడం గమనార్హం.

Next Story

Most Viewed