డుప్లెసిస్ ధనాధన్.. గుజరాత్‌పై బెంగళూరు గెలుపు

by Dishanational3 |
డుప్లెసిస్ ధనాధన్.. గుజరాత్‌పై బెంగళూరు గెలుపు
X

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు‌కు హ్యాట్రిక్ విజయం.. ఐపీఎల్-17లో ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టం చేసుకున్న తర్వాత ఆ జట్టు ఆట తీరు మారింది. పోరాటాన్నే నమ్ముకున్న బెంగళూరు వరుస మ్యాచ్‌ల్లో అదగొడుతున్నది. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 19.3 ఓవర్లలో 147 స్కోరుకే ఆలౌటైంది. సిరాజ్(2/29), యశ్ దయాల్(2/21), విజయ్‌కుమార్ వైశాక్(2/23) బంతితో ప్రత్యర్థిని బెంబేలెత్తించారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 6 వికెట్లు కోల్పోయి 13.4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ డుప్లెసిస్(64) మెరుపు హాఫ్ సెంచరీతో విజయం సునాయామైంది. విరాట్ కోహ్లీ(42) రాణించాడు. ఈ విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు, హ్యాట్రిక్ ఓటమితో గుజరాత్ నాకౌట్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.

పవర్ ప్లేలో కెప్టెన్ విధ్వంసం

ఛేదనలో బెంగళూరుకు దక్కిన శుభారంభం చూస్తే 10 ఓవర్లలోనే ఆ జట్టు గెలుపు ఖాయమే అని అనిపించకమానదు. ఆ రేంజ్‌లో రెచ్చిపోయాడు ఓపెనర్, కెప్టెన్ డుపెస్లిస్. మొదట తొలి ఓవర్‌లో కోహ్లీ రెండు సిక్స్‌లతో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు. ఆ తర్వాతి డుప్లెసిస్ మామూలుగా చెలరేగలేదు. రెండో ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ దంచిన అతను వరుస ఓవర్లలో అదే తరహాలో బ్యాటు ఝుళిపించాడు. దీంతో డుప్లెసిస్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓవర్‌లో డుప్లెసిస్(64) జోరుకు జోష్ లిటిల్ బ్రేక్ వేశాడు. డుప్లెసిస్ విధ్వంసంతో ఆర్సీబీ పవర్ ప్లేలో 92/1 స్కోరుతో నిలిచింది. అప్పటి వరకు పరుగులు పెట్టిన ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆ తర్వాత కుదుపునకు లోనైంది. జోష్ లిటిల్ పేస్ మాయకు బెంగళూరు వరుసగా వికెట్లు కోల్పోయింది. విల్ జాక్స్(1), రజత్ పటిదార్(2), గ్లెన్ మ్యాక్స్‌వెల్(4), కామెరూన్ గ్రీన్(1) దారుణంగా తేలిపోవడంతో 19 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు పడ్డాయి. ఒకవైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ మాత్రం బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు హాఫ్ సెంచరీ దిశగా వెళ్తున్న విరాట్(42)ను నూర్ అహ్మద్ అవుట్ చేశాడు. వరుస వికెట్ల పతనం ఆర్సీబీ జట్టులో ఆందోళనను గురి చేసినప్పటికీ.. దినేశ్ కార్తీక్(21 నాటౌట్), స్విప్నిల్ సింగ్(15 నాటౌట్) ధాటిగా ఆడి మిగతా పనిపూర్తి చేశారు. గుజరాత్ బౌలర్లలో జోష్ లిటిల్ 4 వికెట్లతో సత్తాచాటగా.. నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు.

గుజరాత్‌ను కట్టడి చేసిన ఆర్సీబీ బౌలర్లు

అంతకుముందు గుజరాత్ బ్యాటర్లు తడబడ్డారు. ఆర్సీబీ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు వారు చేతులెత్తేశారు. మొదటి నుంచి ఆ జట్టు ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. ఆరంభంలోనే ఆ జట్టుకు సిరాజ్ భారీ షాక్ ఇచ్చాడు. వరుస ఓవర్లలో వృద్ధిమాన్ సాహా(1), కెప్టెన్ గిల్(2)ను అవుట్ చేశాడు. కాసేపటికే గ్రీన్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్(6) వెనుదిరగడంతో 19 పరుగులకే ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్ ప్లేలో గుజరాత్ స్కోరు 23/3. ఈ సీజన్‌లో పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు ఇదే. ఆ తర్వాత షారుఖ్ ఖాన్(37), డేవిడ్ మిల్లర్(30) కలిసి ఇన్నింగ్స్ నిర్మించారు. నాలుగో వికెట్‌కు వీరు 61 పరుగులు జోడించడంతో జట్టు ట్రాక్ పడింది. అయితే, కర్ణ్ శర్మ బౌలింగ్‌లో మిల్లర్ అవుటవడంతో ఈ జోడీ విడిపోగా.. కాసేపటికే షారుఖ్ ఖాన్‌ను అద్భుతమైన త్రోతో కోహ్లీ పెవిలియన్ పంపాడు. అనంతరం రాహుల్ తెవాటియా(35) విలువైన పరుగులు జోడించాడు. అతనితోపాటు రషీద్ ఖాన్(18)ను యశ్ దయాల్ ఒకే ఓవర్‌లో అవుట్ చేశాడు. ఇక, విజయ్‌కుమార్ వేసిన చివరి ఓవర్‌లో మూడు వికెట్లు పడటంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగాను గుజరాత్ ఆట ముగిసింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ రెండేసి వికెట్లతో సత్తాచాటారు. గ్రీన్, కర్ణ్ శర్మకు చెరో వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ : 147 ఆలౌట్(19.3 ఓవర్లు)

వృద్ధిమాన్ సాహా(సి)కార్తిక్(బి)సిరాజ్ 1, గిల్(సి)విజయ్‌కుమార్(బి)సిరాజ్ 2, సాయి సుదర్శన్(సి)కోహ్లీ(బి)గ్రీన్ 6, షారుఖ్ ఖాన్ రనౌట్(కోహ్లీ) 37, డేవిడ్ మిల్లర్(సి)మ్యాక్స్‌వెల్(బి)కర్ణ్ శర్మ 30, రాహుల్ తెవాటియా(సి)విజయ్‌కుమార్(బి)యశ్ దయాల్ 35, రషీద్ ఖాన్(బి)యశ్ దయాల్ 18, విజయ్ శంకర్(సి)సిరాజ్(బి)విజయ్‌కుమార్ 10, మానవ్ సుతార్(సి)స్వప్నిల్ సింగ్(బి)విజయ్‌కుమార్ 1, మోహిత్ రనౌట్(కార్తీక్/విజయ్‌కుమార్) 0, నూర్ అహ్మద్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 7.

వికెట్ల పతనం : 1-1, 10-2, 19-3, 80-4, 87-5, 131-6, 136-7, 147-8, 147-9, 147-10

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : 152/6(13.4 ఓవర్లు)

కోహ్లీ(సి)సాహా(బి)నూర్ అహ్మద్ 42, డుప్లెసిస్(సి)షారుఖ్ ఖాన్(బి)జోష్ లిటిల్ 64, విల్ జాక్స్(సి)షారుఖ్ ఖాన్(బి)నూర్ అహ్మద్ 1, రజత్ పటిదార్(సి)మిల్లర్(బి)జోష్ లిటిల్ 2, మ్యాక్స్‌వెల్(సి)మిల్లర్(బి)జోష్ లిటిల్ 4, గ్రీన్(సి)షారుఖ్ ఖాన్(బి)జోష్ లిటిల్ 1, దినేశ్ కార్తీక్ 21 నాటౌట్, స్వప్నిల్ సింగ్ 15 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 2.

వికెట్ల పతనం : 92-1, 99-2, 103-3, 107-4, 111-5, 117-6

బౌలింగ్ : మోహిత్(2-0-32-0), జోష్ లిటిల్(4-0-45-4), మానవ్ సుతార్(2-0-26-0), నూర్ అహ్మద్(4-0-23-2), రషీద్ ఖాన్(1.4-0-25-0)

Next Story

Most Viewed